
వరదలో కొట్టుకుపోయిన వ్యక్తి..
శవమై తేలాడు
● మృతదేహంతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద బైఠాయించిన బీజేపీ నేతలు
● ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
షాద్‌నగర్‌రూరల్/కొందర్గు: వాగులో పడి మృతి చెందిన దస్తగిరి లింగమయ్య(42) మృతదేహంతో బీజేపీ నేతలు శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఆందోళన చేశారు. దీంతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. వివరాలు.. కొందుర్గు మండల పరిధిలోని వెంకిర్యాల గ్రామానికి చెందిన లింగమయ్య శుక్రవారం విశ్వనాథ్‌పూర్ వద్ద వాగుదాటుతూ కొట్టుకుపోయాడు. శనివారం ఉదయం మృతదేహం లభ్యమైంది.
మృతుడి కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి
లింగమయ్య మృతదేహం, వారి కుటుంబ సభ్యులతో కలిసి శనివారం బీజేపీ నేత ప్రశాంత్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద బైఠాయించారు. ప్రభుత్వం వాగుపై బ్రిడ్జి నిర్మించకపోవడంతోనే లింగమయ్య మృతి చెందాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పట్టణ సీఐ విజయ్‌కుమార్ పోలీసు సిబ్బందితో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకొని ఆందోళనకారులను అదుపులోకి తీసుకొని ఠాణాకు తరలించారు. క్యాంపు కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు యత్నించిన బీజేపీ కార్యకర్తలను చెదరగొట్టారు. అనంతరం ప్రశాంత్ మాట్లాడుతూ.. బాధిత కుటుంబానికి ప్రభుత్వం రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం ప్రశాంత్‌ను సొంతపూచీకత్తుపై వదిలిపెట్టారు.