
పూల పూజకు వేళాయె..
అప్పట్లో పోటీపడేవారు
అప్పట్లో బతుకమ్మ పాటలు పాడేందుకు పోటీ పడేవారు. మగవాళ్లు గునుగు, తంగేడు, ఇతర పూలు తెచ్చేవారు. ఇప్పుడు ఎవరో పాడిన పాటలు పెట్టి, కోలాటం ఆడటం, చప్పట్లు కొట్టడం తప్ప.. పాడేవారు లేరు. తెలంగాణ వచ్చాక బతుకమ్మకు పేరొచ్చినా, నాటి పాటలు, సంస్కృతిని మరిచిపోతుండటం బాధగా ఉంది.
– అపర్ణ, ఎంపీడీఓ షాబాద్
ఆడబిడ్డల పండుగ
పుష్పోత్సవం.. ఆడబిడ్డల పండుగ. ఊరంతా సందడిగా ఉంటుంది. తొమ్మిది రోజలు రోజుకో పేరుతో ఆడుతం. ఎక్కడ ఉన్నా.. ఈ సంబురానికి సొంతూరికి వెళ్తాం. ఈ పండుగ ప్రకృతిని, దేవుడిని పూజించడంతో పాటు చల్లని శీతాకాలం ప్రారంభాన్ని సూచిస్తుంది. బతుకమ్మ పండుగ మహిళలకు ప్రత్యేకంగా ఉండటం మా అదృష్టం.
– సృజన, ఐసీడీఎస్ సూపర్‌వైజర్, షాబాద్
పువ్వులను కీర్తిస్తూ..
బతుకమ్మ పాటల్లో కష్ట సుఖాలు, ప్రేమ, స్నేహం, బంధుత్వం, ఆప్యాయతలు, భక్తి ఉంటుంది. రకరకాల పువ్వులు రంగులలో పూసి ఉంటాయి. వీటిలో గునుగు పూలు, తంగేడు పూలు ఎక్కువగా పూస్తాయి. బంతి, చామంతికి ఇదే సమయం, ఆడపడుచులు ప్రకృతి సౌందర్యాన్ని అద్భుతమైన తీరొక్క పూలతో కీర్తిస్తూ సంబురం చేసుకుంటారు. ఈ పండుగ తెలంగాణలో సౌందర్యం, ఆత్మగౌరవం పెంపొందిస్తుంది.
– ఆశ్రిత, పంచాయతీ కార్యదర్శి,
కుమ్మరిగూడ, షాబాద్
షాబాద్: తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ. ఈ పండుగ వచ్చిందంటే పల్లె, పట్టణం తేడా లేకుండా పూల పరిమళాలు వెదజల్లుతాయి. గునగు, తంగేడు, పట్టుకుచ్చులు, బంతి, చామంతి, రుద్రాక్ష, గోరింట ఇలా తీరొక్క పువ్వును బతుకమ్మను ఆహ్వానిస్తుంది. అలాంటి పూల పూజను నేటి నుంచి అంగరంగ సంబరంగా ఆడబిడ్డలు జరపుకోనున్నారు. ఎంగిలిపూలు మొదలు సద్దులు వరకు తొమ్మిది రోజుల పాటు బతుకమ్మను ఆటపాటలతో ఆరాధించనున్నారు.
మెట్టినింటి నుంచి..
ప్రకృతిని ఆరాధిస్తూ తెలంగాణ సంస్కృతిని చాటిచెప్పే పూల పండుగ బతుకమ్మ అంటే.. ఆడబిడ్డలకు ఎంతో ఇష్టం. ఈ సందర్భంగా అతివలు అత్తింటి నుంచి పుట్టింటికి చేరుకుంటారు. ప్రకృతిలో లభించే తీరొక్క పూలను సేకరించి, బతుకమ్మలను పేర్చి, గౌరమ్మను పూజిస్తారు.
ఒక్కో రోజు ఒక్కో పేరు..
తొలిరోజు బతుకమ్మను ఎంగిలిపూల బతుకమ్మ అంటారు. ముందురోజు కోసిన పూలను నీళ్లలో వేసి, మరునాడు అలంకరణకు వాడటం వలన ఇలా పిలుస్తారు. రెండో రోజు అటుకుల, మూడో రోజు ముద్దపప్పు, నాలుగో రోజు నానబియ్యం, అయిదో రోజు అట్ల, ఆరో రోజు అమ్మవారు అలక లో ఉంటుందని నమ్మి, బతుకమ్మ ఆడరు. ఏడో రోజు వేపకాయల, ఎనిమిదో రోజు వెన్నముద్దల, తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ అంటారు. చివ రి రోజు ఆడబిడ్డలు ఆడిపాడి, పోయిరా బతుకమ్మ పోయిరావమ్మా.. మళ్లొచ్చే ఏడాదికి తిరిగి రావమ్మా.. అని వీడ్కోలు పలుకుతారు. నీళ్లలో నిమజ్జనం చేశాక.. వాయినం ఇచ్చి పుచ్చుకుంటారు.
నేటి నుంచి ఊరూవాడా
బతుకమ్మ సందడి
ఎంగిలిపూలతో మొదలై
సద్దులతో ముగింపు
ఆట పాటలతో యువతుల సంబురాలు
ఇంటి దేవతగా కొలుస్తాం
తెలంగాణ పండుగ బతుకమ్మ. బొడ్డెమ్మ మొదలు సద్దుల వరకు రోజుకో ప్రత్యేకత ఉంది. బతుకమ్మను ఇంటి దేవతగా కొలుస్తాం. నా చిన్ననాటి నుంచి మా ఇంట్లో అమ్మమ్మ, అమ్మ అక్కలతో కలిసి బతుకమ్మను అలంకరించడం, అందులో నైపుణ్యాన్ని ప్రదర్శించడం చాలా సంతోషంగా ఉంటుంది. పోటా పోటీగా బతుకమ్మను పేరుస్తాం.
– శోభ, చందనవెళ్లి, షాబాద్

పూల పూజకు వేళాయె..

పూల పూజకు వేళాయె..

పూల పూజకు వేళాయె..

పూల పూజకు వేళాయె..