
పిల్లలతో కలిసి తల్లి అదృశ్యం
పహాడీషరీఫ్: ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి అదృశ్యం అయింది. ఈ సంఘటన పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ లక్ష్మణ్ తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్ రాష్ట్రానికి చెందిన అతికుర్ రెహమాన్, భార్య నజినీ కాతూన్(32), ముగ్గురు పిల్లలు దిల్‌నవాజ్(11), హమ్మత్(9), ఫవద్(6)లతో కలిసి జీవనోపాధి నిమిత్తం రెండేళ్ల క్రితం మామిడిపల్లికి వలస వచ్చారు. రెహమాన్ స్థానికంగా ఓ అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా పని చేస్తున్నాడు. ఈ నెల 17న కూరగాయలు తెచ్చేందుకు వెళ్లి తిరిగి వచ్చిన రెహమాన్‌కు ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరూ కనిపించలేదు. వారి కోసం గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. భార్య ఫోన్ స్విచ్ఛాఫ్ ఉంది. దీంతో సదరు వ్యక్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు తెలిసిన వారు పోలీస్‌స్టేషన్, లేదా 87126 62367 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు.
అమ్మగారింటికి వెళ్లొస్తానని..
శంకర్‌పల్లి: అమ్మగారింటికి వెళ్లి వస్తానని వెళ్లిన గృహిణి అదృశ్యం అయింది. ఈ సంఘటన శంకర్‌పల్లి పట్టణంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మున్సిపాలిటీలోని రెడ్డికాలనీలో నగేష్(38), శివాని(22) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి కుమారుడు(8), కుమార్తె(6) ఉన్నారు. నగేష్ సెంట్రింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 18న శివాని తన ఇద్దరూ పిల్లలను పాఠశాలకు పంపించింది. ఉదయం 9 గంటల తర్వాత భర్తతో అమ్మగారింటికి(కొండకల్ గ్రామం) వెళ్లి వస్తానని చెప్పి వెళ్లింది. కానీ రాత్రి అయినా ఆమె తిరిగి రాలేదు. ఆమె కోసం చుట్టు పక్కల వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు.దీంతో ఆమె భర్త ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.