
జల్సాల కోసం చోరీల బాట
● ముగ్గురు నిందితుల అరెస్ట్
● రూ. 18 లక్షల సొత్తు స్వాధీనం
శంషాబాద్: ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు బాల్యస్నేహితులు నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో చిన్నాచితకా ఉద్యోగాలు చేస్తున్నారు. తమ సరదాలు తీర్చుకునేందుకు చోరీల బాట పట్టిన వారు పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యారు. శంషాబాద్ ఏసీపీ శ్రీకాంత్ గౌడ్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి..
ఒకే ఊరి నుంచి బతుకుదెరువుకు వచ్చి..
నాగర్ కర్నూల్ జిల్లా, తాడూరు మండలం, బలన్‌పల్లి గ్రామానికి చెందిన గుల్లు శివప్రసాద్, దంగట్ల లోకేష్, మండలి మనోహర్ స్నేహితులు వీరు ముగ్గురు నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తూ కూకట్‌పల్లిలోని హాస్టల్‌లో ఉంటున్నారు. జల్సాలకు అలవాటు పడిన వారు చోరీలు బాటపట్టారు. ఈ నెల 9న స్థానిక రాఘవేంద్రకాలనీలో ఓ ఇంటి తాళం పగలగొట్టి బంగారు, వెండి ఆభరణాలు చోరీ చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితులను గుర్తించారు. శుక్రవారం రాత్రి మధురానగర్‌లో తనిఖీలు చేపట్టిన పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా గతంలో ఆర్‌జీఐఏ, కూకట్‌పల్లి తాడూరు పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఐదు చోట్ల బంగారం, వెండి ఆభరణాలతో పాటు మూడు బైక్‌లను చోరీ చేసినట్లు అంగీకరించారు. వారి నుంచి 17 తులాల బంగారం, 50 తులాల వెండి, మూడు బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. కేసును చేధించిన ఆర్‌జీఐఏ సీఐ బాలరాజు, పోలీసు సిబ్బందికి ఏసీపీ రివార్డులు అందజేశారు.