
డెంగీ లక్షణాలతో చిన్నారి మృతి!
గ్రామంలో ఫీవర్ సర్వేనిర్వహించిన వైద్య సిబ్బంది
కొత్తూరు: డెంగీ లక్షణాలతో ఓ చిన్నారి మృతి చెందింది. ఈ సంఘటన మండల పరిధి ఎస్‌బీపల్లి గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన వసుప్రియ(8) స్థానిక పాఠశాలలో మూడో తరగతి చదువుతోంది. మూడు రోజులుగా బాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతుండగా.. తండ్రి రమేష్, కోళ్లపడక్‌లో ఆర్‌ఎంపీ వద్ద చికిత్స చేయించాడు. కాగా ఆదివారం రాత్రి చిన్నారి ఆరోగ్యం మరింత క్షీణించగా.. నగరంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. డెంగీతోనే చనిపోయినట్లు గ్రామస్తులు పేర్కొంటున్నారు. విష యం తెలుసుకున్న వైద్యురాలు దీప్తి, సిబ్బందితో కలిసి గ్రామంలో పలువురికి ఫీవర్ పరీక్షలు నిర్వహించారు. ఎవరూ జ్వరంతో బాధపడుతున్నట్లు తమ దృష్టికి రాలేదని తెలిపారు. చిన్నారి డెంగీతో మృతి చెందిందా, ఇతర అనారోగ్య సమస్యలతోనా అనేది వైద్య పరీక్షల్లో తేలనుందన్నారు.
వైద్యం వికటించి
బాలిక మృతి
● వనస్థలిపురం తన్వి ఆసుపత్రి
వైద్యుల నిర్లక్ష్యం
● ఆసుపత్రిపై కేసు నమోదు
హస్తినాపురం: వైద్యం వికటించి బాలిక మృతి చెందిన సంఘటన వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బాధితులు, పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా, పోచంపల్లి మండలం, భీమనపల్లి గ్రామానికి చెందిన డి.శేఖర్, జ్యోతి దంపతుల కుమార్తె నిహారిక (11) ఈ నెల 18న ఆడుకుంటూ నోటిలో రూ.10 బిల్ల వేసుకోవడంతో ప్రమాదవశాత్తు అది గొంతులో ఇరుక్కుపోయింది. కుటుంబ సభ్యులు ఆమెను హుడాసాయినగర్ కమాన్ సమీపంలోని తన్వి ఆసుపత్రిలో చేర్పించారు. చిన్నారి గొంతులో ఇరుక్కున్న కాయిన్ తొలగించిన వైద్యులు శుక్రవారం ఆసుపత్రి నుండి డిశ్చార్జీ చేశారు. అయితే బాలికకు మత్తు మందు ఎక్కువ మోతాదులో ఇవ్వడంతో అపస్మారక స్థితికి చేరుకుంది శనివారం ఉదయం ఎంత లేపినా నిద్ర లేవకపోవడంతో మళ్లీ తన్వి ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఆమెను పరీక్షించిన ఆసుపత్రి నిర్వాహకుడు రాము బాలిక అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించాడు. దీంతో ఆగ్రహానికి లోనైన బాలిక తల్లిదండ్రులు ఆసుపత్రిలో డాక్టర్లు ఎవరూ లేరని డాక్టర్‌గా చెలామని అవుతున్న రాము వైద్యం చేయడం వల్లనే తమ కుమార్తె మృతి చెందిందని ఆరోపిస్తూ ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. వారి బంధువులు, గ్రామస్తులు పెద్దఎత్తున తరలి రావడంతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్తతత నెలకొంది. సమాచారం అందుకున్న వనస్థలిపురం సీఐ మహేశ్, సిబ్బందితో అక్కడికి వచ్చి ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకున్నారు. బాలిక తండ్రి డి.శేఖర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

డెంగీ లక్షణాలతో చిన్నారి మృతి!