
రాష్ట్ర స్థాయికి పది పాఠశాలలు
తుక్కుగూడ: విద్యార్థుల్లో సృజనాత్మకత పెంచేలా బోధనోపకరణాలు ఉండాలని డీఈఓ సుశీందర్‌రావు సూచించారు. గురువారం మున్సిపల్ కేంద్రంలోని దేవేంద్ర విద్యాలయంలో జిల్లా స్థాయి బోధనోపకరణాల ప్రదర్శన (టీఎల్‌ఎం మేళా) ఏర్పాటు చేశారు. ఈ మేళాకు హాజరైన డీఈఓ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేసిన పాఠశాలలు ఈ ప్రదర్శనలో పాల్గొన్నాయని చెప్పారు. తరగతి గదిలో విద్యార్థికి టీఎల్‌ఎంతో బోధన చేస్తే ఆ విషయాన్ని జీవితకాలం గుర్తు పెట్టుకునే అవకాశం ఉంటుందన్నారు. టీఎల్‌ఎంలో ప్రదర్శించిన వినూత్న అంశాలను తయారు చేసి ప్రదర్శించిన ఉపాధ్యాయులను ఈ సందర్భంగా అభినందించారు. రాష్ట్ర స్థాయి టీఎల్‌ఎం మేళాకు పది పాఠశాలను ఎంపిక చేశామన్నారు. రాష్ట్ర స్థాయిలో తమ ప్రతిభ కనభరించేలా బోధనోపకరణాలను తయారు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓలు కస్నానాయక్, కృష్ణయ్య, శంకర్‌నాయక్, చంప్లానాయక్, జయచందర్‌రెడ్డి, వెంకటేశ్, అరుణ్, ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.
చౌదరిగూడ ప్రాథమిక పాఠశాలకు ద్వితీయ బహుమతి
కొందుర్గు: వర్ణమాల, ద్విత్వాక్షరాలు, సంయుక్త, సంశ్లేష అక్షరాలు, భాషాభాగాలపై సిద్ధం చేసిన బోధనాభ్యాసన సామగ్రి ప్రదర్శనకు గాను చౌదరిగూడ ప్రాథమిక పాఠశాలకు జిల్లా స్థాయి ద్వితీయ బహుమతి లభించింది. ఈ నెల 15న మండలస్థాయిలో ప్రథమ స్థానం సాధించుకున్న ఈ పాఠశాల గురువారం జిల్లాస్థాయి టీఎల్‌ఎం మేళాలో ద్వితీయ స్థానం దక్కించుకుంది. ఈ సందర్భంగా డీఈఓ సుశీందర్‌రావు హెచ్‌ఎం నీలా మోహన్ నాయక్‌కు బహుమతి అందజేశారు.
జిల్లా స్థాయి టీఎల్‌ఎం మేళాలో డీఈఓ సుశీందర్‌రావు