
నామినేషన్లకు నేడే ఆఖరు
● మదర్ డెయిరీ డైరెక్టర్ ఎలక్షన్లకు ఇప్పటికే పది నామినేషన్లు దాఖలు
● రేపు పరిశీలన
● 27న పోలింగ్
హయత్‌నగర్: నల్గొండ– రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార యూనియన్ లిమిటెడ్(నార్ముల్ మదర్ డెయిరీ) పాలక మండలి డైరెక్టర్ల ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోందని ఎలక్షన్ అధికారి వెంకట్‌రెడ్డి తెలిపారు. ఈ నెలలో ముగ్గురి పదవీకాలం ముగియనుందని, ఈ స్థానాల కోసం శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తామని పేర్కొన్నారు. శనివారం మధ్యాహ్నం 2 గంటల వరకు నామినేషన్ల పరిశీలన, అనంతరం పోటీలో ఉన్నవారి పేర్లను ప్రకటిస్తామని తెలిపారు. సోమవారం సాయంత్రం 5గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ, పోటీలో ఉన్నవారి తుది జాబితాను విడుదల చేస్తామని, పోటీ లేకపోతే వెంటనే ఏకగ్రీవమైన వారి వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు. పోటీ ఉంటే ఈనెల 27న హయత్‌నగర్‌లోని ఎస్‌వీ గార్డెన్స్‌లో ఉదయం 8నుంచి సాయంత్రం 7 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తామని, ఓట్ల లెక్కింపు అనంతరం ఫలితాలను ప్రకటిస్తామని పేర్కొన్నారు.
ఇప్పటికే పది నామినేషన్లు
మదర్ డెయిరీ ఎన్నికల్లో మూడు స్థానాల్లో పోటీ చేసేందుకు గురువారం పది నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అధికారి తెలిపారు. జనరల్ మహిళ స్థానానికి రెండు, రెండు జనరల్ స్థానాలకు ఎనిమిది నామినేషన్లు వచ్చాయన్నారు.