
రైతులకు రాయితీ
● జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి సురేశ్
● కూరగాయలు, ఆయిల్ పామ్ సాగుకు ప్రభుత్వ ప్రోత్సాహం
కడ్తాల: కూరగాయలు పండించే రైతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రాయితీలు అందిస్తోందని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి సురేశ్ తెలిపారు. మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో గురువారం జిల్లా ఉద్యానశాఖ ఆధ్వర్యంలో రెయిన్ ఫాల్ ఏరియా డెవలప్‌మెంట్ పథకం, ఆయిల్ పామ్ పంట సాగుపై రైతులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సురేశ్ మాట్లాడుతూ.. కూరగాయలు సాగు చేసే రైతులకు ప్రభుత్వం రెయిన్ ఫాల్ ఏరియా డెవలెప్‌మెంట్ పథకం కిం రూ.30 వేలు రాయితీ ఇస్తూ ప్రోత్సహిస్తోందన్నారు. కొంత నగదుతో పాటు కూరగాయల బుట్టలు, వర్మిబెడ్స్, తేనెటీగ బాక్స్ తదితరాలు వస్తురూపంలో అందిస్తోందని వివరించారు. అర్హులైన రైతులు ఖచ్చితంగా కూరగాయలు పండిస్తూ పాడి పశువులు కలిగి ఉండాలని చెప్పారు. ఆయిల్‌పామ్ పంట సాగుతో రైతులు అధిక దిగుబడులు పొంది ఆర్థికాభివృద్ధి సాధించవచ్చన్నారు. ఈ సాగును ప్రోత్సహించేందుకు మొక్కలకు 90 శాతం, డ్రిప్ ఇరిగేషన్‌కు 80–100 శాతం రాయితీ, మొక్కలు నాటిన తర్వాత నాలుగు సంవత్సరాలపాటు ఎకరాకు రూ.4,200 నగదు అందజేస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఉద్యాన అధికారి సౌమ్య, వ్యాల్యూ ఆయిల్ వైస్ చైర్మన్ రామ్మోహన్‌రావు, ఏరియా మేనేజర్ ప్రమోద్, హెచ్‌ఈఓ ప్రవాన్, కిశోర్ తదితరులు పాల్గొన్నారు.