అమరుల స్థూపం.. త్యాగానికి ప్రతిరూపం
షాద్‌నగర్: అమరవీరుల స్థూపం వారి త్యాగాలకు ప్రతిరూపంగా నిలుస్తుందని ప్రొఫెసర్ కోదండ రాం అన్నారు. బుధవారం పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఉద్యమ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ అమర వీరుల స్ధూపం ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రొఫెసర్ కోదండరాం, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అన్ని వర్గాల ప్రజలు పోరాటం చేశారని గుర్తు చేశారు. తొలి, మలి దశ ఉద్యమంలో ఎందరో ప్రాణాలు కోల్పోయారన్నారు. అమరుల త్యాగాల ఫలితంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని చెప్పారు. ఉద్యమంలో అసువులు బాసిన అమరుల త్యాగాలకు చిహ్నంగా స్మారక స్థూపం ఏర్పాటు చేయడం హర్షనీయమన్నారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్ర సాధనకు అమరులు చేసిన త్యాగం వెలకట్టలేనిదని అన్నారు. జనవరి 26 నాటికి స్థూపం ఏర్పాటుచేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బాబర్‌ఖాన్, రఘు నాయక్, చెంది తిరుపతిరెడ్డి, వెంకట్‌రాంరెడ్డి, కరుణాకర్, జనార్ధన్, టీజీ శ్రీనివాస్, ఇబ్రహీం, అన్వర్, దర్శన్, ముబారక్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ ఉద్యమ చరిత్ర గొప్పది
షాద్‌నగర్‌రూరల్: ప్రపంచ ఉద్యమ చరిత్రలో తెలంగాణ ఉద్యమం గొప్పదని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే వీర్లపల్లిశంకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాపాలన దినోత్సవానికి ప్రొఫెసర్ కోదండరాం హాజరై జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తితోనే రాష్ట్రంలో ప్రజాపాలన ప్రభుత్వాన్ని తెచ్చుకున్నామన్నారు. ప్రజల ఆకాంక్ష మేరకు సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ నాయకులు, ఉద్యమకారులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రొఫెసర్ కోదండరాం
1/1
అమరుల స్థూపం.. త్యాగానికి ప్రతిరూపం