
పల్లెలు మెరవాలి
ప్రభుత్వ పథకాలతో చేయూత
ఇబ్రహీంపట్నం రూరల్: స్వచ్ఛతతో పల్లెలు మెరవాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా స్వచ్ఛతా హీసేవ–2025 కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ.. ఈ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 17– అక్టోబర్ 2వ తేదీ వరకు జిల్లాలోని అన్ని మండలాలు, గ్రామాల్లో నిర్వహించాలన్నారు. ఇందులో ప్రజా భాగస్వామ్యం తప్పనిసరి అని చెప్పారు. 15 రోజుల పాటు చెత్త పేరుకుపోయిన ప్రదేశాలను గుర్తించి శుభ్రం చేయడం, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు తదితర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు కిట్‌లు అందజేసి సఫాయి మిత్ర సురక్షా శిబిర్ కార్యక్రమం, శ్రమదాన కార్యక్రమాలు చెత్త నుంచి కళాకృతులు తయారు చేయడం, ప్లాస్టిక్ నిర్మూలనపై అవగాహన కార్యక్రమాలు, పాఠశాలలు, గ్రామాల్లో స్వచ్ఛతా ర్యాలీలు, మహిళా సంఘాలు, విద్యార్థులతో ప్రతిజ్ఞలు చేయించాలని సూచించారు. విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖన పోటీలు నిర్వహించాలన్నారు.
చిరు ధాన్యాలతో ఆరోగ్యం
అనంతరం కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన చిరుధాన్యాల ఆహార పదార్థాల విక్రయ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ.. తృణ ధాన్యాలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయన్నారు. శరీరానికి పోషకాలు పుష్కలంగా లభిస్తాయని, మాంసాహారంతో పోలిస్తే చిరు ధాన్యాల్లో ప్రొటీన్స్ ఎక్కువగా ఉంటాయని చెప్పారు. చిరు ధాన్యాలను రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలని సూచించారు.
విరాట్ విశ్వకర్మ జయంతి ఉత్సవాలను కలెక్టరేట్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలన చేసిన కలెక్టర్ విశ్వకర్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతీ వస్తువుకు ఒక ఆకృతిని ఇచ్చే వారే విశ్వకర్మలన్నారు. శిల్పులకు ఆదరణ కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్న పథకాలు వారి వృత్తులకు చేయూతనిస్తాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు చంద్రారెడ్డి, శ్రీనివాస్, డీఆర్‌ఓ సంగీత, డీసీపీ సునీతారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ అధికారి కేశురాం, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఉష, సీపీఓ సౌమ్య, డీఆర్‌డీఓ శ్రీలత, సీఈఓ కృష్ణారెడ్డి, డీపీఓ సురేశ్ మోహన్, అడిషనల్ డీఆర్‌డీఓ సుభాషిణి తదితరులు పాల్గొన్నారు .
స్వచ్ఛతా హీసేవ–2025లో ప్రజా భాగస్వామ్యం తప్పనిసరి
కలెక్టర్ నారాయణరెడ్డి
కలెక్టరేట్‌లో విశ్వకర్మ జయంత్యుత్సవాలు