
ట్రిపుల్‌ఆర్ అలైన్‌మెంట్ మార్చొద్దు
● సాగర్ హైవే దిగ్బంధానికిరైతుల యత్నం
● మద్దతు తెలిపిన అఖిలపక్షం నాయకులు
మాడ్గుల/యాచారం: రీజినల్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ మార్చాలని అఖిలపక్షం నాయకులు, బాధిత రైతుల ఆధ్వర్యంలో మాడ్గుల మండలం అన్నెబోయినపల్లి గేటు వద్ద బుధవారం హైవే దిగ్బంధం చేపట్టారు. తమ భూములు లాక్కోవద్దని ప్రభుత్వానికి వ్యతిరేకంగా బాధితులు నినాదాలు చేశారు. అనంతరం సాగర్ హైవేపై బైఠాయించడంతో కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. దీంతో ఇబ్రహీంపట్నం ఏసీపీ రాజు ఆధ్వర్యంలో పోలీసులు రంగ ప్రవేశం చేసి అడ్డుకున్నారు. ఆందోళనకారులను యాచారం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ నిరసనలో మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, సీపీఎం జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య తదితరులున్నారు.
మార్చులు ఉండొద్దు
యాచారం పోలీస్‌స్టేషన్ వద్ద జైపాల్‌యాదవ్ మాట్లాడుతూ.. రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణంలో పేద రైతులకు అన్యాయం చేస్తూ, సీఎం రేవంత్‌రెడ్డి బంధువులకు మేలు చేసేలా చేస్తున్నారని ఆరోపించారు. సీఎం బంధువుల వ్యవసాయ భూములను కాపాడుకోవడం కోసమే తరచూ అలైన్‌మెంట్లు మార్చుతూ రైతుల్లో గందరగోళం సృష్టిస్తున్నారన్నారు. గతంలో బీఆర్‌ఎస్ సర్కార్ హయాంలోనే రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం పట్ల అలైన్‌మెంట్ తయారు చేసి, రైతుల మద్దతు తీసుకున్నామన్నారు. ప్రస్తుతం ఎలాంటి మార్పులు లేకుండా రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీనియర్ నాయకుడు రాంచంద్రయ్య, బీఆర్‌ఎస్ యాచారం మండల అధ్యక్షుడు రమేశ్‌గౌడ్, నాయకులు యాదయ్యగౌడ్, సత్యపాల్, జైపాల్‌రెడ్డి, లక్ష్మినరసింహ, కృష్ణారెడ్డి, తిరుమల్‌రెడ్డి, రాజవర్ధన్‌రెడ్డి రైతులు తదితరులు పాల్గొన్నారు.