
ఔషధ మొక్కలతో ఆరోగ్యానికి మేలు
ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
మొయినాబాద్ రూరల్: ఔషధ మొక్కలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి అన్నారు. బుధవారం మండల పరిధిలోని తోల్‌కట్ట చౌరస్తాలో ఉన్న పీవీ నర్సింహారావు కేంద్రంలో స్వామి రామానంద తీర్థ వనమూలికల కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా హాజరైన మంత్రి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఔషధ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ఔషధ మొక్కలు మానవ మనుగడకు ముఖ్యమన్నారు. కాలుష్యం పెరగుతున్న తరుణంలో ఔషధ మొక్కలను పెంచి స్చవ్ఛమైన ఆరోగ్యాన్ని పొందవచ్చని సూచించారు. ఎమ్మెల్సీ సురభి వాణీదేవి ఆధ్వర్యంలో చేపడుతున్న మొక్కల పెంపకం ప్రతీ ఒక్కరికి ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి, పీసీసీ అధికార ప్రతినిధి గౌరీ సతీశ్, కాంగ్రెస్ చేవెళ్ల ఇన్‌చార్జి పామెన భీంభరత్, పార్టీ మండల అధ్యక్షుడు మాణయ్య, రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సాక్షి, సిటీబ్యూరో: నగర పోలీసులు తొలిసారిగా ట్రాఫిక్ సమస్యలు, పరిష్కారాలపై కీలక సదస్సు నిర్వహించనున్నారు. హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ నేతృత్వంలో ట్రాఫిక్ అండ్ రోడ్ సేఫ్టీ సమ్మిట్–2025 పేరుతో రెండు రోజుల పాటు దీనిని తలపెట్టారు. నెక్లెస్ రోడ్‌లోని జలవిహార్‌లో గురువారం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సదస్సును ప్రారంభించనున్నారు. ఇందులో వివిధ వాణిజ్య సంస్థలు, నిపుణులు, స్టార్టప్స్, స్వచ్ఛంద సంస్థలకు చెందిన ప్రతినిధులు పాల్గొననున్నారు. సురక్షిత నగరాలు, స్థిరమైన రవాణా, సమగ్రమైన ప్రయాణ వ్యవస్థలు, రోడ్డు భద్రతకు సంబంధించిన డిజైన్లు, సాంకేతిక పరిజ్ఞాతం వినియోగం, భవిష్యత్తులో సవాళ్లు, ప్రజల భాగస్వామ్యం తదితర అంశాలపై కూలంకషంగా రెండు రోజుల పాటు చర్చించనున్నారు. సదస్సు తీర్మానాలను విధానపరమైన నిర్ణయాల కోసం ప్రభుత్వానికీ సిఫార్సు చేయాలని అధికారులు నిర్ణయించారు. రహదారి భద్రత, ఎలక్ట్రానిక్ వాహనాలు తదితర రంగాల్లో సేవలు అందిస్తున్న స్టార్టప్స్, సంస్థలు తమ ఉత్పత్తులను ప్రదర్శించేందుకు ఈ సమ్మిట్‌లో అవకాశం కల్పిస్తున్నారు. నగరంలోని ట్రాఫిక్ సమస్యలు, విభాగాల మధ్య సమన్వయ లోపం, నగరవాసుల్లో అవగాహన లేమి, పాలకుల నిర్లక్ష్యాలకు ఈ సమ్మిట్ ద్వారా పరిష్కార మార్గాలు చూపాలని సెక్యూరిటీ కౌన్సిల్ భావిస్తోంది.
ఏజీవర్సిటీ: ఈ నెల 19న పీవీ నరసింహారావు పశు వైద్య విశ్వవిద్యాలయం 5వ స్నాతకోత్సవం నిర్వహిస్తున్నట్లు వీసీ ఎం.జ్ఞాన ప్రకాశ్ తెలిపారు. బుధవారం పశువైద్య విశ్వవిద్యాలయంలో వీసీ భవనంలో ఆయన మాట్లాడుతూ.. స్నాతకోత్సవం 2023 నుంచి 2024 వరకు పట్టభద్రులైన మొత్తం 524 మందికి పట్టాలు ప్రదాన చేస్తామన్నారు. 25 మంది విద్యార్థులకు బంగారు పతకాలు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమం ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాల యం ఆడిటోరియంలో నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. సమావేశంలో రిజిస్ట్రార్ శరత్‌చంద్ర, ఫ్యాకల్టీస్ డీన్ ఉదయ్‌కుమార్ పాల్గొన్నారు.