
‘మణి’కొండ చుట్టే అనకొండలు!
ఏసీబీ చిక్కిన తిమింగళాలు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాలోని ‘మణి’కొండ చుట్టే అనకొండలు పాగా వేశాయి. ఇవి ఒక్కొక్కటిగా ఏసీబీ వలకు చిక్కుతున్నాయి. ఎల్‌ఆర్‌ఎస్ క్లియరెన్స్ కోసం రూ.4 లక్షలు తీసుకుంటూ నార్సింగి మున్సిపల్ కార్పొరేషన్ టీపీఓ మణిహారిక ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన ఘటన మరువక ముందే మంగళవారం దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ఇబ్రహీంబాగ్ ఆపరేషన్స్ ఏడీఈ అంబేడ్కర్‌ను ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన కేసులో ఏసీబీ అరెస్ట్ చేసింది. తాజాగా బుధవారం ఆయన సన్నిహితుడు, బినామీ చేవెళ్ల ఏడీఈ రాజేశ్ ఇంట్లోనూ సోదాలు నిర్వహించగా బాత్‌రూంలో రూ.17 లక్షల నగదు సహా పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఈయన ఇదే డివిజన్‌లోని చిలుకూరు సెక్షన్ ఏఈగా పని చేశారు. ఇటీవలే పదోన్నతిపై చేవెళ్లకు వెళ్లడం గమనార్హం.
తప్పించినా.. తప్పుకోకుండా..
ఏడీఈ అంబేడ్కర్ 1998 ఏపీఎస్‌ఈబీ ద్వారా ఖమ్మంలో తొలి పోస్టింగ్. ఆ తర్వాత డిప్యూటేషన్‌పై జీహెచ్‌ఎంసీకి ఏఈగా వచ్చారు. ఏడీఈగా పదోన్నతి పొందిన తర్వాత డిస్కంలోకి అడుగుపెట్టారు. పటాన్‌చెరు, కేపీహెచ్‌బీ, గచ్చిబౌలి ప్రాంతాల్లో కీలక పోస్టుల్లో పనిచేశారు. ఆయన సర్వీసు అంతా ఫోకల్ పోస్టుల్లోనే కొనసాగారు. కాగా ఇబ్రహీంబాగ్, మణికొండ, గచ్చిబౌలి డివిజన్లపై గత ఏడాది డిస్కం ఉన్నతాధికారులకు భారీగా ఫిర్యాదులు అందాయి. ఈ అంశాన్ని సీఎండీ ముషారఫ్ ఫరూఖీ సీరియస్‌గా తీసుకుని అప్పట్లో గచ్చిబౌలి డీఈని బదిలీ చేశారు. ఇబ్రహీంబాగ్ డీఈకి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఇదే సమయంలో ఏడీఈ అంబేడ్కర్‌ను సైతం మరో చోటికి బదిలీ చేశారు. అయినా కదలకుండా ప్రభుత్వంలోని పెద్దలకు భారీగా ముడుపులు ముట్టజెప్పి అదే పోస్టులో కొనసాగుతూ వచ్చారు. సాధారణంగా మూడేళ్లు ఫోకల్ పోస్టులో పని చేస్తే.. ఆ తర్వాత ఉంచరు. కానీ ఏడీఈ అంబేడ్కర్ విషయంలో నిబంధనలు అమలు కాలేదు. ప్రభుత్వంలోని పెద్దలే ఆయనకు అండగా నిలవడంతో ఉన్నతాధికారులు సైతం చేతులెత్తేశారు. ఏడీఈగా ప్రభుత్వ సంస్థ నుంచి ప్రతి నెలా రూ.లక్షల్లో వేతనాలు పొందుతూ.. తన బినామీలతో యూజీ కేబుల్ వర్క్‌లు చేయించి, పెద్ద మొత్తంలో ఆస్తులను కూడబెట్టినట్లు ఏసీబీకి ఫిర్యాదులు అందాయి. దీంతో ఆయ న ఇంటితో పాటు బంధువులు, సన్నిహితుల నివాసాలు, ఆఫీసుల్లోనూ ఏసీబీ సోదాలు చేపట్టింది.
17 మంది ఇంజనీర్లపై ముఖ్యమంత్రి ఆరా?
ఇబ్రహీంబాగ్ డివిజన్ చిలుకూరు సెక్షన్ ఏఈగా పని చేసి, ఇటీవలే పదోన్నతిపై చేవెళ్ల వెళ్లిన ఏడీఈ రాజేశ్.. ఇప్పటికే ఏసీబీ కేసులో అరైస్టెన అంబేడ్కర్‌కు బినామీగా వ్యవహరించినట్లు సమాచారం. ఇద్దరు కలిసే పలు కాంట్రాక్టులు చేసినట్లు తెలుస్తోంది. మారేడుపల్లిలో నివాసం ఉంటున్న చేవెళ్ల ఏడీఈ రాజేశ్ ఇంట్లో బుధవారం ఏసీబీ సోదాలు నిర్వహించగా బాత్‌రూమ్‌లో రూ.17 లక్షల నగదు సహా కీలక స్థిరాస్తి డాక్యుమెంట్లు లభించినట్లు సమాచారం. కాగా ఏసీబీ అధికారులు మాత్రం ఈ అంశాన్ని ఇంకా ధ్రువీకరించలేదు. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు ఫోకల్ టు ఫోకల్ పోస్టులు దక్కించుకున్న 17 మంది ఇంజనీర్లపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరా తీసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఏళ్లుగా శివారు ప్రాంతాల్లోనే విధులు నిర్వహిస్తూ భారీగా ఆస్తులు కూడబెట్టిన ఇంజనీర్లలో ఏడీఈ, డీఈలే కాకుండా పలువురు సీఈ, ఎస్‌ఈ స్థాయి అధికారులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఏసీబీ సోదాలతో ఆయా అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఎప్పుడు? ఎక్కడ? సోదాలు చేస్తారో? అనే ఆందోళన ఆయా ఇంజనీర్లలో వ్యక్తమవుతోంది.
ఉద్యోగులకు కాసుల వర్షం
శివారు మున్సిపాలిటీలు, పోలీసుస్టేషన్లు, రెవెన్యూ, రిజిస్ట్రేషన్, విద్యుత్, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసుల్లో పోస్టుల కోసం ఉద్యోగుల మధ్య తీవ్రమైన పోటీ ఉంటుంది. ఐటీ అనుబంధ సంస్థలు, హైరైజ్ భవనాలు, హోటళ్లు, వ్యాపార, వాణిజ్య సంస్థలు ఎక్కువగా ఉన్న హైటెక్‌సిటీ, మణికొండ, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, బండ్లగూడజాగీర్, నార్సింగి, కోకాపేట్, గండిపేట్, రాజేంద్రనగర్, శంషాబాద్ మొయినాబాద్ సహా శివారు ప్రాంతాలు ఆయా విభాగాల ఉద్యోగులకు కాసుల వర్షం కురిపిస్తుంటాయి. వివిధ విభాగాల్లోని, వివిధ సెక్షన్లలో ఫోకల్ పోస్టింగ్‌ల కోసం భారీగా వెచ్చిస్తుంటారు. వీటిని తిరిగి సంపాదించుకునేందుకు అడ్డదారులు తొక్కుతూ ఏసీబీకి చిక్కుతున్నారు.
ఏసీబీ వలకు వరుసగా చిక్కుతున్న అవినీతి తిమింగళాలు
నార్సింగి టీపీఓ అంశాన్ని మరువక ముందే మరొకరు
ఏడీఈ అంబేడ్కర్ సన్నిహితుడు చేవెళ్ల ఏడీఈ ఇంట్లో తాజాగా సోదాలు
రూ.17 లక్షల నగదు, పలు స్థిరాస్తి పత్రాలు గుర్తించినట్లు సమాచారం
రాజేంద్రనగర్ మున్సిపాలిటీ డిప్యూటీ కమిషనర్ కె.రవికుమార్ జూలై 24న ఓ హోటల్ యజమాని నుంచి రూ.2 లక్షలు తీసుకుంటూ ఏసీబీకీ చిక్కారు.
మణికొండ మున్సిపల్ పరిధిలోని జలమండలి మేనేజర్ స్ఫూర్తిరెడ్డి నల్లా కనెక్షన్‌కు రూ.30 వేలు తీసుకుంటూ పట్టుబడింది. – మణికొండ మున్సిపల్ ఇంజనీరింగ్ డీఈ దివ్యజ్యోతి ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు స్వయంగా ఆమె భర్త వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో ఉన్నతాధికారులు ఆమెను తప్పించారు. ఏసీబీ కేసు నమోదైనప్పటికీ నేటికీ అరెస్ట్ చేయలేదు.
నెక్నాంపూర్‌లోని ఓ నిర్మాణానికి నిరభ్యంతర పత్రం జారీ కోసం రూ.2.50 లక్షలు డిమాండ్ చేసిన ఇరిగేషన్ ఏఈ నిఖేష్, గండిపేట సర్వేయర్ గణేశ్ ఎన్‌ఓసీ జారీ కోసం భారీగా డబ్బులు డిమాండ్ చేసి పట్టుబడ్డారు.
ఏఈ నిఖేష్ రూ.500 కోట్లకు పైగా ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించి, కొంత మొత్తాన్ని స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.
నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ బన్సీలాల్, అసిస్టెంట్ ఇంజనీర్ కార్తీక్ ఏసీబీ కేసులో అరెస్ట్ అయ్యారు.
గోపన్‌పల్లిలో నిర్మాణంలో ఉన్న ఓ భవనానికి విద్యుత్ మీటర్ మంజూరుకు రూ.50వేలు డిమాండ్ చేసి గచ్చిబౌలి డివిజన్ ఏడీఈ సతీశ్ ఏసీబీకి చిక్కారు. ఆయన వంద కోట్లకుపైగా ఆస్తులను కూడబెట్టినట్లు గుర్తించారు.
మాదాపూర్ డిప్యూటీ స్టేట్ టాక్స్ ఆఫీసర్ ఎం.సుధ జూలై 9న ఓ చిన్న కంపెనీకి జీఎస్టీ రిజిస్ట్రేషన్ కోసం రూ.8 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ పట్టుబడింది.