
సాయుధ పోరు వారసులు కమ్యూనిస్టులే
ఇబ్రహీంపట్నం రూరల్: తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి నిజమైన వారసులు కమ్యూనిస్టులేనని డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేశ్ పేర్కొన్నారు. బుధవారం భారత విద్యార్థి ఫెడరేషన్ ఇబ్రహీంపట్నం డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో సాయుధ పోరాట వాస్తవాలు–వక్రీకరణ అనే అంశంపై ఇబ్రహీంపట్నంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు రమేశ్, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజులు విచ్చేసి మాట్లాడుతూ.. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరీ విముక్తి కోసం సాయుధ పోరాటం సాగిందన్నారు. నిజాం అరాచకాలకు ఎదిరిస్తూ సామాన్యులు సాయుధులుగా మారారన్నారు. నిజాంను గద్దెదింపడం కోసం నాయకత్వం వహించింది కమ్యూనిస్టులేనన్నారు. సాయుధ పోరులో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ స్థానమేక్కడిదన్నారు. నిర్బంధాలు, త్యాగాలు చేసింది ఎందరో చెప్పగలరా అని ప్రశ్నించారు. వీరోచిత తెలంగాణ సాయుధ పోరాటానికి ఏమాత్రం సంబంధం లేని పార్టీలు విమోచన, విలీనం, విద్రోహం అంటూ నేడు చరిత్రను వక్రభాష్యాలు చెబుతున్నారన్నారు. బీజేపీ అనేక ఏళ్ల నుంచి తెలంగాణలో మతపరమైన భావోద్వేగాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తుందన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి శంకర్, డీవైఎఫ్‌ఐ కార్యదర్శి జగన్, నాయకులు సామేలు, గణేష్, శ్రీకాంత్, వంశీ, తరంగ్, జంగయ్య, అజయ్, చరణ్ తదితరులు పాల్గొన్నారు.
డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు రమేశ్