
పల్లెల్లో రోడ్ల చిచ్చు!
కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న ప్రభుత్వ వరుస ప్రకటనలు అడ్డగోలు సర్వేలతో అయోమయం రోడ్డెక్కుతున్న రోజుకో గ్రామం రైతులు
పాత అలైన్‌మెంట్లు.. కొత్త ప్రతిపాదనలు
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ప్రభుత్వం మారిన ప్రతిసారి రోడ్లకు సంబంధించిన అలైన్‌మెంట్లను మార్చుతుండటం, బడా రియల్ ఎస్టేట్ కంపెనీలకు, ప్రభుత్వ పెద్దలకు లబ్ధి చేకూర్చేలా, సన్న చిన్నకారు రైతులకు నష్టం వాటిల్లేలా అలైన్‌మెంట్లు మారుతుండటం ఆందోళనలకు కారణమవుతోంది. అధికారుల ప్రతిపాదనలకు భిన్నంగా ప్రకటనలు ఉంటుండటంతో ఆయా రోడ్లు, ప్రాజెక్టులకు భూము లు ఇచ్చేందుకు రైతులు నిరాకరిస్తున్నారు. ఒక్కొక్కరుగా రోడ్డెక్కుతున్నారు. ఇప్పటికే మాడ్గుల, ఆమనగల్లు, కేశంపేట, షాద్‌నగర్ రైతులు వరుస ఆందోళనలు చేపట్టగా.. తాజా ప్రతిపాదనలతో మరికొంత మంది సన్నద్ధమవుతున్నారు.
వివాదాస్పదంగా కొత్త అలైన్‌మెంట్
నగరంలో వాహనాల రద్దీతో పాటు దూరభారాన్ని తగ్గించేందుకు ఔటర్‌కు అవతలి వైపున ఉత్తర భాగంగలోని సంగారెడ్డి–తూప్రాన్–గజ్వెల్–భువనగిరి–చౌటుప్పల్ మీదుగా.. దక్షిణ భాగంలోని చౌటు ప్పల్–షాద్‌నగర్–సంగారెడ్డి వరకు 356 కిలోమీటర్ల రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) ఏర్పాటుకు ప్రభుత్వం సంకల్పించింది. ఇప్పటికే ఉత్తర భాగంలో భూసేకరణ ప్రక్రియ పూర్తి చేసింది. దక్షిణ భాగంలోనూ ఇటీవలే నోటిఫికేషన్ జారీ చేసింది. పాత అలైన్‌మెంట్‌కు భిన్నంగా కొత్తగా మరో అలైన్‌మెంట్ రూపొందించింది. దీంతో రోడ్డు విస్తీర్ణంతో పాటు భూ విస్తీర్ణం పెరుగుతోంది. పాత అలైన్‌మెంట్‌ను పక్కన పెట్టి.. కొత్తదాని ప్రకారం భూసేకరణ ప్రక్రియకు నోటిఫికేషన్ జారీ చేయడం వివాదాస్పదమైంది. జిల్లాలోని మాడ్గుల, ఆమనగల్లు, కేశంపేట, షాద్‌నగర్, ఫరూఖ్‌నగర్, కొందుర్గు, పరిగి, వికారాబాద్ మండలాల్లో భూములు కోల్పోతున్న రైతులు ఇప్పటికే ఆందోళన బాటపట్టారు.
పారిశ్రామికవాడలు.. రీజినల్ రింగ్‌రోడ్లు.. గ్రీన్‌ఫీల్డ్ రోడ్లు.. రేడియల్ రోడ్లు .. ఇలా వరుసగా జిల్లా రైతుల కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఇప్పటికే పలు పారిశ్రామిక వాడలు, ప్రాజెక్టుల పేరుతో భారీగా భూసేకరణ చేపట్టిన ప్రభుత్వం తాజాగా రోడ్ల విస్తరణ, కొత్త రోడ్ల ప్రతిపాదనలను తెరపైకి తెస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వ ప్రకటనలతో ఉన్న కొద్దిపాటి భూములు, ఉపాధి అవకాశాలు కోల్పోవాల్సి వస్తుందనే ఆవేదన ఆయా రైతుల్లో వ్యక్తమవుతోంది.
భూమినే నమ్ముకున్నాం
సర్వే నంబర్ 217, 233లలో మూడెకరాల సాగు భూమి ఉంది. అది కూడా రీజినల్ రింగ్‌రోడ్డులో పోతోంది. ఇప్పటి వరకు భూమినే నమ్ముకుని బతికాం. పాత అలైన్‌మెంట్‌కు భిన్నంగా రోడ్డు వేస్తుండటంతో నష్టపోవాల్సి వస్తోంది. తక్షణమే ఈ ప్రతిపాదన విరమించుకోవాలి.
– వెంకటస్వామి,
రైతు, జంగారెడ్డిపల్లి, తలకొండపల్లి మండలం
రోడ్డున పడాల్సి వస్తుంది
వ్యవసాయమే జీవనాధారం. సాగునీటి వసతి పుష్కలంగా ఉంది. ఏడాదికి రెండు పంటలు పండుతాయి. నాకున్న 3.35 ఎకరాల భూమి నుంచే రీజినల్ రింగ్ రోడ్డు పోతోంది. నా కుటుంబం రోడ్డున పడాల్సి వస్తోంది. బంజరు భూములు వదిలి పంట భూముల నుంచి రోడ్లు వేయడం తగదు.
– వెంకటేశ్‌గౌడ్,
రైతు, తంగళ్లపల్లి, కొందుర్గు మండలం

పల్లెల్లో రోడ్ల చిచ్చు!

పల్లెల్లో రోడ్ల చిచ్చు!