
‘రీజినల్’ అలైన్‌మెంట్ మార్చొద్దు
కందుకూరు: మార్చిన రీజినల్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ను వెంటనే వెనక్కి తీసుకోవాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు దుబ్బాక రాంచందర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం కందుకూరు చౌరస్తాలో ర్యాలీ నిర్వహించి ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డికి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా రాంచందర్ మాట్లాడుతూ.. వందల ఎకరాలున్న భూస్వాముల భూములను కాపాడడం కోసం పేద, సన్న, చిన్నకారు రైతుల భూములను రీజినల్ రింగ్ రోడ్డు పేరుతో దౌర్జన్యంగా తీసుకోవడం ఏమిటని ప్రశ్నించారు. తక్షణమే కొత్త అలైన్‌మెంట్‌ను రద్దు చేసి పాత అలైన్‌మెంట్ ప్రకారమే భూసేకరణ చేపట్టాలని అన్నారు. లేనిపక్షంలో రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కానుగుల వెంకటయ్య, ప్రజా సంఘాల నాయకులు గుమ్మడి కురుమయ్య, పిప్పళ్ల శివశంకర్, అంకగళ్ల కుమార్, మాజీ ప్రజా ప్రతినిధులు గడిగ వెంకటస్వామి, లక్ష్మయ్య, పబ్బతి శ్రీను, భూ నిర్వాసితులు పాల్గొన్నారు.