
దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా..
యువతి మృతి, ముగ్గురికి తీవ్ర,నలుగురికి స్వల్ప గాయాలు
అబ్దుల్లాపూర్‌మెట్: స్నేహితులంతా కలిసి దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో వారు ప్రయాణిస్తున్న కారు ఔటర్ రింగ్‌రోడ్డుపై అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఓ యువతి మృతిచెందగా ముగ్గురికి తీవ్ర, మరో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్ పరిఽధిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాల గ్రామానికి చెందిన రాళ్లకత్వ వెంకటేశ్వర్ రెడ్డి కూతురు సౌమ్యారెడ్డి (25) నగరంలోని ఇన్ఫోసిస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తోంది. తన స్నేహితులైన నందకిషోర్, వీరేంద్ర, ప్రణీష్, సాగర్, అరవింద్, ఝాన్సీ, శృతితో కలిసి ఆదివారం కారులో రాచకొండ సమీపంలోని సరళమైసమ్మ దేవాలయానికి వెళ్లారు. తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలో రాత్రి బొంగ్లూర్ వద్ద ఔటర్‌పై నుంచి ఘట్‌కేసర్ వైపు వెళ్తుండగా మార్గమధ్యలో బలిజగూడ సమీపంలోకి రాగానే భారీగా కురుస్తున్న వర్షం కారణంగా వీరు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో సౌమ్యారెడ్డితో పాటు పలువురికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు చికిత్స నిమిత్తం వివిధ ఆస్పత్రులకు తరలించారు. సౌమ్యారెడ్డి చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతిచెందింది. మరో ముగ్గురు తీవ్రగాయాలతో చికిత్స పొందుతుండగా, మిగిలిన వారికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ మేరకు మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
డివైడర్‌ను ఢీకొట్టి ఔటర్‌పై కారు బోల్తా

దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా..