
పెద్దమంగళారంలో హార్టికల్చర్ వర్సిటీ!
భూసేకరణకు సిద్ధమైన ప్రభుత్వం 373 ఎకరాల లావణి, సర్కార్ భూముల గుర్తింపు తాజాగా రైతులతో సమావేశమైన అధికారులు
మొయినాబాద్: ప్రభుత్వ, లావణి భూములు స్వాధీనం చేసుకునేందుకు సర్కార్ రంగం సిద్ధం చేస్తోంది. మొయినాబాద్ ప్రాంతంలో గోశాల ఏర్పాటుకు వంద ఎకరాలు కేటాయించిన ప్రభుత్వం మరో 373 ఎకరాల్లో హార్టికల్చర్ యూనివర్సిటీ ఏర్పాటుకు సన్నాహాలు మొదలుపెట్టింది. ఇప్పటికే భూములు సర్వే చేసిన చేసిన రెవెన్యూ అధికారులు సోమవారం భూసేకరణపై రైతులతో సమావేశం నిర్వహించారు.
ఇప్పటికే పూర్తయిన సర్వే
మున్సిపల్ పరిధిలోని పెద్దమంగళారం రెవెన్యూలో హార్టికల్చర్ వర్సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టింది. అందుకోసం ప్రభుత్వ, లావాణి భూములను ఎంచుకుంది. సర్వే నంబర్ 218లో 227.35 ఎకరాలు, సర్వేనంబర్ 149లో 155.12 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించింది. ఆయా సర్వే నంబర్లలోని భూములను ఇప్పటికే రెవెన్యూ అధికారులు సర్వే చేశారు. 218 సర్వేనంబర్‌లో అప్పట్లోనే 52 ఎకరాల భూమిని 16 మంది రైతులకు కేటాయించి లావణి పట్టాలు ఇచ్చారు. లావణి భూములు రైతులు ఇతరులకు విక్రయించడంతో చేతులు మారాయి. ప్రస్తుతం ఈ భూములు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్నాయి. ఇదే సర్వే నంబర్‌లోని పది ఎకరాల్లో ప్రభుత్వ బాలుర వసతి గృహం, పల్లె ప్రకృతి వనం, ప్రార్థనా మందిరాలు నిర్మించారు. 149 సర్వే నంబర్‌లోని 155.12 ఎకరాల ప్రభుత్వ భూమిలో కొంత మంది రైతులు పంటలు సాగుచేసుకుని జీవనం సాగిస్తున్నారు. ఈ భూములను సర్కార్ స్వాధీనం చేసుకునేందుకు రైతులతో చర్చలు మొదలు పెట్టింది. రాజేంద్రనగర్‌లో ఉన్న హార్టికల్చర్ వర్సిటీని ఇక్కడ ఏర్పాటు చేసేందుకే భూసేకరణ జరుగుతున్నట్లు అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది.
ప్రభుత్వ అవసరాలకే..
ప్రభుత్వ అవసరాల కోసం పెద్దమంగళారంలో భూసేకరణ జరుగుతోందని చేవెళ్ల ఆర్డీఓ చంద్రకళ అన్నారు. సోమవారం పెద్దమంగళారం వార్డు కార్యాలయం వద్ద రైతులు, గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అభివృద్ధిలో భాగంగా ఇక్కడి సర్కారు భూములను తీసుకోవడం జరుగుతోందన్నారు. అసైన్డ్ పట్టా ఉన్న రైతులకు ఎకరాకు 800 గజాల స్థలం, పట్టా లేకుండా ప్రభుత్వ భూమిని సాగుచేసుకుంటున్న రైతులకు ఎకరాకు 300 గజాల చొప్పున పరిహారం ఇస్తామన్నారు. హెచ్‌ఎండీఏ నిబంధనల ప్రకారం లేఅవుట్ చేసి రైతులకు పరిహారం ఉంటుందన్నారు. త్వరలోనే మరోసారి సమావేశం నిర్వహిస్తామని, అప్పటిలోగా రైతులు తమ నిర్ణయాన్ని తెలియజేయాలని కోరారు. సమావేశంలో తహసీల్దార్ గౌతమ్‌కుమార్, ఆర్‌ఐ రాజేష్, పీఏసీఎస్ చైర్మన్ చంద్రారెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు కొంపల్లి అనంతరెడ్డి, మాజీ సర్పంచ్ కోట్ల నరోత్తంరెడ్డి, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ డప్పు రాజు, నాయకులు సంజీవరావు, మోహన్‌రెడ్డి, సుధాకర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.