
విద్యార్థి జీవితంలో పదో తరగతి కీలకం
షాద్‌నగర్‌రూరల్: పదో తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని జిల్లా విద్యాధికారి సుశీందర్‌రావు అన్నారు. ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోని మొగిలిగిద్ద కేజీబీవీని సోమవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పాఠాలు బోధించారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. విద్యార్థి జీవితంలో పదో తరగతి కీలకమైన మెట్టు అని అన్నారు. క్రమ శిక్షణతో కూడిన విద్యను నేర్చుకొని పరీక్షల్లో రాణించాలని సూచించారు. లక్ష్యాన్ని నిర్దేశించుకుని, సాధన కోసం నిరంతరం కృషి చేయాలన్నారు. విద్యాభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న ప్రోత్సాహం, సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ మనోహర్, కేజీబీవీ ప్రత్యేక అధికారిణి అరుణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.