
తాగునీటికి కటకట!
మొయినాబాద్: వర్షా కాలంలోనూ ప్రజలకు నీటి కష్టాలు తప్పడం లేదు. మిషన్ భగీరథ నీళ్లు రాకపోవడం.. స్థానికంగా ఉన్న బోరు మోటార్లు కాలిపోవడంతో మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని హిమాయత్‌నగర్‌లో వారం రోజులుగా తాగునీటి కటకట ఏర్పడింది. దీంతో ప్రజలు ప్రైవేట్ ట్యాంకర్లతో నీళ్లు పోయించుకుంటున్నారు. గ్రామానికి నీటి సరఫరా అయ్యే మిషన్ భగీరథ పైపులైన్లు పగిలిపోవడంతోపాటు స్థానికంగా ఉన్న బోరు మోటార్లు కాలిపోవడంతో వారం రోజులుగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పైపులైన్లు, బోరు మోటార్లకు మరమ్మతులు చేయించాల్సిన మున్సిపల్ అధికారులు తమకేమి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో విధిలేని పరిస్థితిలో ప్రైవేట్ ట్యాంకర్ల ద్వారా నీటిని పోయించుకుంటున్నామని చెబుతున్నారు.
గ్రామస్తుల ఆందోళన
హిమాయత్‌నగర్‌లో వారం రోజులుగా మంచినీటి సరఫరా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడంలేదని శనివారం స్థానికులు ఆందోళన చేశారు. గ్రామంలో తాగునీటి సమస్యతోపాటు ఇతర సమస్యలు చాలా ఉన్నాయని.. మున్సిపల్ అధికారులకు ఫోన్ చేసినా స్పందించడంలేదని మండిపడ్డారు. రోజుకో దగ్గర మిషన్ భగీరథ పైపులైన్లు పగిలిపోతున్నాయని, మరమ్మతులు చేయాలని చెప్పినా ఎవరూ స్పందించడం లేదన్నారు. వీధిదీపాలు సరిగా లేవని.. రోడ్లపైనే మురుగునీరు పారుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదన్నారు. వీటిపై ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా మున్సిపల్ కమిషనర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో నెలకొన్న సమస్యలతోపాటు మున్సిపల్ కమిషన్ తీరుపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.
వర్షాకాలంలోనూ తప్పని తిప్పలు
హిమాయత్‌నగర్‌లో పైపులైన్లుపగిలి భగీరథ నీళ్లు బంద్
బోరు మోటార్ల కాలిపోయినా పట్టించుకోని అధికారులు
వారం రోజులుగా అవస్థలు పడుతున్న ప్రజలు

తాగునీటికి కటకట!