
పురుగు మందు తాగి డ్రైవర్ ఆత్మహత్య
ఇబ్రహీంపట్నం రూరల్: కుటుంబ కలహాలతో పురుగు మందు తాగి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదిబట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ వెంకటేశ్ కథనం ప్రకారం.. తుర్కయంజాల్ మున్సిపాలిటీ కుర్మల్‌గూడ రాజీవ్ గృహకల్పలో నివాసం ఉండే మోతిలాల్(40) డ్రైవర్ పని చేసుకుంటూ జీవించేవాడు. కుటుంబ కలహాలతో ఈ నెల 8వ తేదీన పురుగు మందు తాగాడు. ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం ఆయన మృతి చెందాడు. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నట్లు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అందజేశారు.
మట్టి ట్రాక్టర్ పట్టివేత
మాడ్గుల: మండలంలోని మాడ్గుల గ్రామ శివారులోని వాగు నుంచి శనివారం ఉదయం అక్రమంగా మట్టిని తవ్వి తరలిస్తున్న ట్రాక్టర్‌ను సీజ్ చేసినట్లు సీఐ వేణుగోపాల్‌రావు తెలిపారు. పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు గమనించి ప్రశ్నించగా ఎలాంటి అనుమతులు లేవని చెప్పడంతో వాటిని సీజ్ చెసినట్లు చెప్పారు. డ్రైవర్, వాహన యాజమనులపై కేసు నమోదు చేసినట్లు ఆయన వివరించారు.
బతుకుపోరాటంలో ఆగిన గుండె
కందుకూరు: బతుకు పోరాటంలోనే ఓ గుండె ఆగిపోయింది. మండల పరిధిలోని కటికపల్లికి చెందిన ఎంట్ల అశోక్(35) టిప్పర్‌పై డ్రైవర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రోజూ మాదిరిగానే శనివారం ఉదయం గ్రామ సమీపంలోని క్రషర్ మిషన్ వద్ద డస్ట్ లోడ్ నింపుకొని బయలుదేరాడు. మార్గమధ్యలో ఛాతిలో నొప్పి రావడంతో వాహనాన్ని పక్కకు నిలిపేసి, డ్రైవింగ్ సీట్లోనే ప్రాణం వదిలాడు. మృతుడిడి భార్య, ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు. అశోక్ మృతితో వీరంతా దిక్కులేని పక్షులయ్యారు. అందరితో కలివిడిగా ఉండే వ్యక్తి మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
బైక్ దొంగకు ఏడాదిన్నర జైలు
ఇబ్రహీంపట్నం రూరల్: నిత్యం బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ఓ దొంగకు ఏడాదిన్నర జైలు శిక్షాతో పాటు రూ.5వేల జరిమానా విధించిన సంఘటన ఆదిబట్ల పోలీస్‌స్టేషన్ పరిఽధిలో చోటు చేసుకుంది. సీఐ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. రావిర్యాల సమీపంలో గ్యార దశరథ అనే వ్యక్తి స్కూటీని 2025 మార్చి17న రైస్ గోదాం వద్ద పెట్టి పనులు చేసుకుంటుండగా దొంగిలించారు. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా అప్పట్లో పోలీసులు సీసీ కెమెరాలు ఆధారంగా కేసును ఛేదించారు. మహమ్మద్ అప్రోజ్‌ఖాన్ దొంగిలించినట్లు గుర్తించి కేసు నమోదు చేసి కోర్టుకు పంపించారు. అప్పటి నుంచి కోర్టులో విచారణ జరిగింది. కేసు పూర్వపరాలను పరిశీలించిన ఇబ్రహీంపట్నం 15 ఎంఎం కోర్టు న్యాయమూర్తి నిందితుడు అప్రోజ్‌ఖాన్‌కు ఏడాదిన్నర జైలుశిక్షతో పాటు రూ.5వేల జరిమానా విధించినట్లు సీఐ తెలిపారు.

పురుగు మందు తాగి డ్రైవర్ ఆత్మహత్య