
ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలి
● ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్
● ఇబ్రహీంపట్నంలో సంఘం సర్వసభ్య సమావేశం
ఇబ్రహీంపట్నం: పదోన్నతులలో మిగిలి పోయిన ఖాళీలను.. అర్హులైన ఉపాధ్యాయులతో భర్తీ చేయాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు పుట్టపాక ప్రవీణ్‌కుమార్ కోరారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సంఘం ఇబ్రహీంపట్నం సెక్టార్ సర్వసభ్య సమావేశాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల, ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టుల వారీగా టీచర్ల కొరత ఏర్పడిందని తెలిపారు. అర్హత ఉన్నవారికి పదోన్నతి కల్పించి, వాటిని భర్తీ చేయాలని సూచించారు. ఈ ఏడాదిలో పదోన్నతులు కల్పించకపోతే అనేక మంది ఉద్యోగ విరమణ పొందుతారని పేర్కొన్నారు. పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయ, ఉద్యోగుల జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌ను తిరిగి పునరుద్ధరించడం హర్షణీయమని తెలిపారు. జిల్లా ప్రధాన కార్యదర్శి సత్తు పాండు రంగారెడ్డి మాట్లాడుతూ.. జీఓ 317 ద్వారా నష్టపోయిన స్థానికులకు న్యాయం చేయాలన్నారు. సీపీఎస్‌ను రద్దు చేసి, క్రమం తప్పకుండా డీఏలను మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమంలో సంఘం నాయకులు పాండురంగారెడ్డి, జగనోహ్మన్‌రెడ్డి, పరమేశ్, శ్రీనివాస్‌రావు, బాలకృష్ణ, మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.