
రెవెన్యూ లుక్!
ఇబ్రహీంపట్నం: రెవెన్యూ వ్యవస్థకు పూర్వవైభవం రానుందని క్షేత్రస్థాయి ఉద్యోగులు, ప్రజలు సంబర పడుతున్నారు. ప్రక్షాళన పేరుతో గ్రామాల్లో పనిచేసిన వీఆర్‌ఏ, వీఆర్‌ఓలను గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం తొలగించింది. జిల్లాలో సుమారు 277 మంది వీఆర్‌ఓలు, 800 మంది వీఆర్‌ఏలు పనిలేకుండా కొంత కాలం కూర్చున్నా అనంతరం వివిధ శాఖల్లో వారిని భర్తీ చేశారు. మాతృ సంస్థను వదిలి ఇతర శాఖల్లో పనిచేయలేక పలువురు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది లేకపోవడంతో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లపైనే పనిభారం ఎక్కువ అయింది. గ్రామస్థాయిలో ఏదైన సమస్య ఎదురైతే విచారించడం కష్టంగా మారింది. వీఆర్‌ఓలు లేకపోవడంతో ప్రజలు సైతం అవస్థలు పడాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన అనంతరం రెవెన్యూ వ్యవస్థను గ్రామస్థాయి నుంచి పటిష్ట పరుస్తామని ప్రకటించింది. ఇందులో భాగంగా ధరణి స్థానంలో భూ భారతిని తీసుకొచ్చింది. ఇప్పుడు పల్లెల్లో జీపీఓలను నియమించనుంది.
అబ్దుల్లాపూర్‌మెట్ నుంచి అత్యధికం
వివిధ శాఖల్లో పనిచేస్తున్న వీఆర్‌ఓ, వీఆర్‌ఏలను తిరిగి గ్రామ పరిపాలనాధికారులుగా నియమిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. తిరిగి మాతృసంస్థలోకి వెళ్లాలనుకునే వారికి విద్యార్హతలు, అనుభవం తదితర కొన్ని నియమ నిబంధనలు పెట్టి గ్రామ పరిపాలన అధికారుల నియామకం కోసం పరీక్ష నిర్వహించారు. జిల్లా నుంచి 271 మంది ఎంపికయ్యారు. ఇబ్రహీంపట్నం డివిజన్ నుంచి 81 మంది గ్రామ పరిపాలనాధికారులుగా(జీపీఓ) అర్హత సాధించారు. ఇబ్రహీంపట్నం మండలం నుంచి 14 మంది, అబ్దుల్లాపూర్‌మెట్ నుంచి 18 మంది, యాచారం, మంచాల మండలాల నుంచి 11 మంది చొప్పున, హయత్‌నగర్, మాడ్గుల మండలాల నుంచి ఏడుగురు, ఇతర జిల్లాల నుంచి 13 మంది జీపీఓలుగా ఎంపికయ్యారు.
పూర్వవైభవం సంతరించుకోనున్న శాఖ
వీఆర్‌ఓ, వీఆర్‌ఏల స్థానంలో గ్రామ పరిపాలనాధికారులుగా భర్తీ
జిల్లాలో 271 మంది జీపీఓల ఎంపిక
హర్షం వ్యక్తం చేస్తున్న పూర్వ ఉద్యోగులు
నేడు నియామక పత్రాల అందజేత
ఎంపికై న జీపీఓలు నగరంలోని మాదాపూర్ హైటెక్స్‌లో శుక్రవారం జరిగే కార్యక్రమంలో నియామకపత్రాలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా అందుకోనున్నారు. ఇందుకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. జీపీఓలుగా ఎంపికై న వారికి ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించి ఆయా గ్రామాల్లో నియమించనున్నారు. దీంతో రెవెన్యూ వ్యవస్థకు గ్రామ స్థాయిలో ఓ అధికారిని నియమించినట్లు అవుతుంది. ఫలితంగా ఆ శాఖకు పూర్వ వైభవం వస్తుందనే ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.