
ప్రమాదంలో పెద్దచెరువు!
మొయినాబాద్: ప్రమాదకర స్థాయిలో నిండిన చిలుకూరు పెద్ద చెరువులోని నీటిని దిగువకు వదిలేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని శిఖం రైతులు, గ్రామస్తులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఎఫ్‌టీఎల్‌కు మించి ఒక అడుగు ఎత్తుకు చేరిన నీటిని విడుదల చేయకపోతే ప్రమాదం చోటుచేసుకునే అవకాశం ఉందంటున్నారు. కానీ నీటిని వదిలే విషయంలో మున్సిపల్, ఇరిగేషన్ అధికారుల మధ్య సమన్వయం కొరవడింది. ఎక్కువగా ఉన్న నీటిని కిందికి వదిలేందుకు ఇరిగేషన్ అధికారులు కాలువ తీయగా కొందరు స్థానికులు మూసేశారు. దీంతో ఎగువ నుంచి వస్తున్న వరదతో చెరువు నీటిమట్టం మరింత పెరుగుతోంది. బ్యాక్ వాటర్‌తో ఓ వైపు పంటలు మునుగుతుండగా.. మరోవైపు గ్రామానికి ముప్పు పొంచి ఉంది. అలుగుపై మట్టి పేరుకుపోవడం, కింది భాగంలో రోడ్డు నిర్మించడంతో చెరువులో ఎఫ్‌టీఎల్ స్థాయికి మించి ఒక అడుగు మేర నీరు నిలుస్తోంది. వారం రోజుల క్రితం అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ చెరువును పరిశీలించి, నీటిని కొద్దికొద్దిగా దిగువకు వదిలేయాలని అధికారులకు సూచించారు. దీంతో నీళ్లు వెళ్లేందుకు బుధవారం ఇరిగేషన్ అధికారులు కాలువ తీశారు. కానీ రాత్రి వేళ కొందరు స్థానికులు కాల్వలో మట్టిపోసి మూసేశారు. ఎగువ నుంచి వస్తున్న నీళ్లతో చెరువులోని నీటి మట్టం ప్రమాదకర స్థాయికిచేరుకుంది. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్‌ను అడగగా తమకు సంబంధం లేదని చెబుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
ఎఫ్‌టీఎల్ స్థాయికి మించి అడుగు మేర నిలిచిన నీళ్లు
అధిక నీటిని దిగువకు వదలడంలో శాఖల మధ్య సమన్వయ లోపం
ఎగువ నుంచి వస్తున్న వరదతో మరింతగా పెరుగుతున్న నీటి మట్టం

ప్రమాదంలో పెద్దచెరువు!