
తాళం వేసిన ఇంట్లో చోరీ
మూడు తులాల బంగారం, 22 తులాల వెండి వస్తువుల అపహరణ
కేశంపేట: దుండగులు తాళం పగులగొట్టి ఇంట్లో చోరీ చేసిన సంఘటన మండల పరిధిలోని అల్వాల గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కమ్లీకర్ అంజలి, భర్త పరమేశ్వర్, ఇద్దరు పిల్లలతో కలిసి తన తల్లిగారి ఊరైన కొందుర్గు మండలంలోని ఉత్తరాశిపల్లికి బుధవారం వెళ్లింది. గురువారం ఉదయం ఆమెకు బంధువులు ఫోన్ చేసి తన ఇంట్లో దొంగలు పడినట్లు చెప్పారు. వెంటనే స్వగ్రామంలోని ఇంటికి వచ్చి చూడగా గేటు తెరిచి, మెయిన్ డోర్ తాళం పగిలి ఉంది. బెడ్రూంలోని బీరువా లాకర్‌ను దుండగులు పగులగొట్టి మూడు తులాల బంగారం, 22 తులాల వెండి వస్తువులతో పాటుగా రూ.రెండు వేల నగదును దొంగిలించినట్లు గుర్తించారు. ఇదే విషయమై పోలీసులకు అంజలి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఇన్‌స్పెక్టర్ నరహరి తెలిపారు.
ట్రాక్టర్ ఢీకొని పెయింటర్ దుర్మరణం
శంకర్‌పల్లి: ట్రాక్టర్ ఢీకొనడంతో ఓ పెయింటర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన గురువారం మోకిల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ కోటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లాకు చెందిన శ్రీపాద రామాచారి(35), భాను దంపతులు. వీరు బతుకుదెరువు నిమిత్తం పదిహేనేళ్ల క్రితం హైదరాబాద్ వచ్చి, బాలానగర్‌లో నివాసం ఉంటున్నారు. రామాచారి పెయింటర్‌గా, భాను కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. శంకర్‌పల్లి మండలం మోకిలలో ఓ భవనానికి పెయింటింగ్ వేస్తున్న రామాచారి బుధవారం తన తమ్ముడు లక్ష్మణ్‌తో కలిసి రాత్రి వరకూ పని చేసి, ఇక్కడే పడుకున్నారు. గురువారం ఉదయాన్నే టిఫిన్ చేసేందుకు బయటకు వచ్చి, తిరిగి వెళ్తుండగా వెనక నుంచి అతివేగంగా వచ్చిన ట్రాక్టర్ రామాచారిని ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య భాను ఫిర్యాదు మేరకు కేసు, నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.
టీయూడబ్ల్యూజేఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సైదులు
కొత్తూరు: హక్కులు, తమ న్యాయపరమైన సమస్యల పరిష్కారం కోసం జర్నలిస్టులు ఐక్యంగా ఉండి పోరాటాలు చేయాలని టీయూడబ్ల్యూజేఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సైదులు పిలుపునిచ్చారు. మండలంలోని ఇన్ముల్‌నర్వలో ఉన్న జేపీదర్గా ఆవరణలో గురువారం నియోజకవర్గ స్థాయి జర్నలిస్టుల సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తుక్కుగూడలో ఈ నెల 26న సంఘం మూడో మహాసభలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీంట్లో భాగంగా దర్గాలో విలేకరులతో కలిసి సన్నాహాక సమావేశాన్ని నిర్వహించామన్నారు. బలమైన సంఘం, జర్నలిస్టుల ఐక్యతతోనే సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. సంఘం ఆధ్వర్యంలో జర్నలిస్టుల కోసం భవిష్యత్తులో చేపట్టే కార్యక్రమాలను సభలో చర్చించనున్నట్లు తెలిపారు. తుక్కుగూడలో నిర్వహించే మహాసభలకు నియోజకవర్గం నుంచి అధిక సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సంఘం సభ్యులు సురేష్, శ్రీనివాస్‌చారి, గణేష్, మోహన్‌రెడ్డి, ఖాజాపాషా, డివిజన్ అధ్యక్షుడు రాఘవేందర్‌గౌడ్, నరేశ్ పాల్గొన్నారు.

తాళం వేసిన ఇంట్లో చోరీ