
ఆర్డినెన్స్ పేరిట మోసం
● రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్లు
అమలు చేయాలి
● షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే
అంజయ్య యాదవ్
షాద్‌నగర్: ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా బీసీ రిజర్వేషన్లను అమలుచేయాలని షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం నగరంలోని ఇందిరాపార్కు వద్ద బీఆర్‌ఎస్ మహాధర్నాకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ నాయకులు పెద్ద ఎత్తున ధర్నాకు తరలివెళ్లారు. ఈ సందర్భంగా అంజయ్య యాదవ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్డినెన్స్ పేరుతో బీసీలను మోసం చేసేందుకు కుట్రలు చేస్తోందని ఆరోపించారు. గతంలో చాలా బిల్లులు అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పటికీ అవి అమలుకు నోచుకోలేదని విమర్శించారు. ఏ బిల్లుకై నా రాజ్యాంగ పరమైన ఆమోదం లభించినప్పుడే అమల్లోకి వస్తుందని అన్నారు. ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పూర్తి స్ధాయిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధంగా అమలు చేసే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. ధర్నాకు తరలిన వారిలో నాయకులు ఈట గణేశ్, ఎమ్మె శ్రీలత, సత్యనారాయణ, దేవేందర్ యాదవ్, తదితరులు ఉన్నారు.