
చిరుతల కోసం అన్వేషణ
పహాడీషరీఫ్: బాలాపూర్‌లోని ఆర్‌సీఐ (రీసెర్చ్ సెంటర్ ఇమారత్)లో చిరుత పులులు సంచరించాయన్న వదంతుల నేపథ్యంలో అటవీశాఖ అధికారులు శనివారం వాటి జాడ కోసం గాలించారు. ఎలాంటి ఆనవాళ్లు కనిపించలేదు. ఆర్సీఐలో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న వ్యక్తి మూడు రోజుల క్రితం చిరుత కనిపించిందంటూ అధికారులకు వెల్లడించడం, మరుసటి రోజు ఓ శునకం ఇదే ఆవరణలో మృతి చెందడంతో చిరుతలు తిరుగుతుండొచ్చని భావించారు. ముందు జాగ్రత్తలో భాగంగా ఈ ఆవరణలోనే ఉన్న డిఫెన్స్ ల్యాబోరేటరీస్ స్కూల్ ప్రిన్సిపాల్.. విద్యార్థుల తల్లిదండ్రులకు ఇదే విషయాన్ని నోటీస్ రూపంలో పంపి, పాఠశాల నుంచి బయటకు వెళ్లకుండా చూసుకోవాలన్నారు. ఇది కాస్తా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో అటు అటవీ శాఖ, ఇటు బాలాపూర్ పోలీసులు రంగంలోకి దిగారు. ఆర్సీఐ పరిసరాల్లో చిరుతల పాదముద్రల కోసం అన్వేషించారు. అలాంటి ఆనవాళ్లు ఏవీ లభించలేదని బాలాపూర్ ఇన్‌స్పెక్టర్ ఎం.సుధాకర్ తెలిపారు. వేరే ఏదైనా జంతువును చూసి చిరుతగా భావించి ఉండొచ్చని అటవీశాఖ అధికారులు తెలిపినట్లు తెలిసింది.
ఆనవాళ్లు లభించలేదన్న అధికారులు