
గోశాలకు సాగు భూములెందుకు?
మొయినాబాద్: గోశాల ఏర్పాటుకు రైతులు సాగు చేసుకుంటున్న భూములెందుకు ఇస్తున్నారు.. బీడులుగా మారిన ప్రభుత్వ భూములు చాలా ఉన్నాయి.. వాటిని ఇవ్వండని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. మున్సిపల్ పరిధిలోని ఎనికేపల్లి రైతులు చేపడుతున్న రిలే నిరహార దీక్షలో శనివారం ఆయన పాల్గొన్నారు. పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడి వివరాలు తెలసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎనికేపల్లి 180 సర్వే నంబర్‌లోని 99.14 ఎకరాల భూముల్లో 30 ఎకరాలను 1954లోనే ప్రభుత్వం రైతులకు అసైన్డ్ చేసిందని అన్నారు. మిగతా భూమిని సైతం విడతలవారీగా అసైన్డ్ చేయగా కొంత ప్రభుత్వ భూమిగా ఉందన్నారు. మొత్తం భూమిని రైతులు సుమారు 80 ఏళ్లుగా సాగుచేసుకుంటున్నారని.. వర్షాధార పంటలు వేసుకుని జీవనం సాగిస్తున్నారని తెలిపారు. అలాంటి పేద రైతుల భూములను గోశాలకోసం లాక్కోవడం సరికాదన్నారు. ప్రభుత్వం ఎకరాకు 300 గజాల ఇంటి స్థలం పరిహారంగా ఇస్తామని చెబుతోందని.. 80 ఏళ్ల క్రితం 50 కుటుంబాలుగా ఉన్న రైతులు నాలుగు తరాలు గడవడంతో ఇప్పుడు 500 కుటుంబాలకు పెరిగాయన్నారు. ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకుని పరిహారం ఇవ్వాలని సూచించారు. ఈ విషయమై త్వరలోనే సీఎం రేవంత్‌రెడ్డిని కలుస్తానని చెప్పారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు సన్‌వెల్లి ప్రభాకర్‌రెడ్డి, మున్సిపల్ అధ్యక్షుడు శ్రీకాంత్, పార్టీ మండల మాజీ అధ్యక్షులు నర్సింహారెడ్డి, పద్మనాభం, మాజీ సర్పంచ్ రాజు తదితరులు పాల్గొన్నారు.
బీడు భూములు ఇవ్వండి
ఎనికేపల్లి రైతులకు న్యాయం చేయండి
చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి