
ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి
మొయినాబాద్: వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని చేవెళ్ల ట్రాఫిక్ సీఐ వెంకటేశం అన్నారు. మొయినాబాద్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారిపై సోమవారం ట్రాఫిక్ పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహించారు. పెండింగ్ చలాన్లను వాహనదారులతో కట్టించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించవద్దన్నారు. ద్విచక్రవాహనదారులు హెల్మెంట్ తప్పనిసరిగా పెట్టుకోవాలన్నారు. తనిఖీలు నిర్వహించినవారిలో ట్రాఫిక్ ఏఎస్సైలు, కానిస్టేబుళ్లు ఉన్నారు.
ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీని అరికట్టండి
డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి జగన్
ఇబ్రహీంపట్నం రూరల్: జిల్లాలో విచ్చలవిడిగా ప్రైవేట్ ఆస్పత్రుల ఫీజుల దోపిడీని అరికట్టాలని డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో కలెక్టర్ నారాయణరెడ్డికి సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి పి.జగన్ మాట్లాడుతూ.. ఫీజుల దోపిడీ విచ్చలవిడిగా కొనసాగుతుందన్నారు. ప్రజల అవసరాన్ని అవకాశంగా తీసుకొని రూ.లక్షలు దండుకుంటున్నారని మండిపడ్డారు. అవసరం లేని టెస్టులు, మందులు ఇస్తున్నారన్నారు. ఆపరేషన్లు అవసరం లేకున్నా ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఆస్పత్రిలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంస్థ జిల్లా ఉపాధ్యక్షుడు శివశంకర్, సభ్యుడు రాఘవేందర్, మహేష్, వినోద్, శ్యామ్ పాల్గొన్నారు.
బ్రేక్ డౌన్.. ట్రాఫిక్ జాం
గచ్చిబౌలి: రద్దీ సమయాల్లో వాహనాలు రోడ్లపై బ్రేక్‌డౌన్ అవుతుండడంతో ట్రాఫిక్ జాం నెలకొంటుంది. వాహనాల రాకపోకలకు అంతరాయం కల్గుతోంది. సోమవారం ఉదయం 10.10 గంటల సమయంలో గచ్చిబౌలి ఫ్లై ఓవర్‌పై ఓ ప్రైవేట్ బస్సు బ్రేక్‌డౌన్ అవడంతో టెలికాంనగర్ నుంచి ఇందిరానగర్ వైపు వెళ్లే వాహనాల రాకపోకలకు ఆటంకం కల్గింది. మాదాపూర్, కూకట్‌పల్లి, మెహిదీపట్నం తదితర ప్రాంతాల నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, లింగంపల్లి వైపు వెళ్లే వాహనాల రాకపోకలు మందకొడిగా సాగాయి. మరమ్మతులు చేసిన అనంతరం రాయదుర్గం ట్రాఫిక్ పోలీసులు బస్సును పక్కకు తరలించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.
ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య
దుద్యాల్: తల్లిదండ్రులు మందలించారనే మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మండల పరిధిలోని హస్నాబాద్‌లో సోమవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు, కొడంగల్ ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన చాకలి వెంకటమ్మ, ఇస్వప్పకు ముగ్గురు కుమారులు. వ్యవసాయం చేసుకునే తల్లిదండ్రులకు పెద్ద కుమారుడు నవీన్(24) చేదోడువాదోడుగా ఉండేవాడు. ఇటీవల తన బైక్‌పై గుజరాత్, ఆరుణాచలంతో పాటు ఇతర సుదూర ప్రాంతాలకు వెళ్లి వచ్చాడు. ఈ విషయమై తల్లిదండ్రులు అతన్ని మందలించారు. బైక్‌పై వందల కిలోమీటర్ల ప్రయాణం సురక్షితం కాదని, ప్రమాదాలు జరిగే అవకాశంతో పాటు ఆరోగ్యం పాడవుతుందని చెప్పారు. పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాల పేరుతో మరోసారి బైక్‌పై వెళ్లొద్దని సూచించారు. దీంతో మనస్తాపానికి గురైన నవీన్ సోమవారం ఉదయం పొలానికి వెళ్లి చెట్టుకు ఉరేసుకున్నాడు. చేతికి వచ్చిన చెట్టంత కొడుకు ఇలా చేస్తాడని ఊహించలేదని బాధిత తల్లిదండ్రులు రోదించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. యువకుడి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి