
మా పిల్లలను సర్కారు బడిలో చేర్పిస్తాం
మంచాల: ప్రభుత్వ పాఠశాలలో తమ పిల్లలనుచేర్పిస్తామని పలువురు ముస్లింలు ప్రకటించారు. శుక్రవారం మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో నిర్వహించిన మనఊరు– మనబడి కార్యక్రమంలో భాగంగా అంబేడ్కర్ చౌరస్తాలో ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర విద్య కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి ఆరుట్ల పాఠశాలను దత్తత తీసుకొని, రూ.10 కోట్లతో అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దుతున్నారని పేర్కొన్నారు. పేద పిల్లలకు నాణ్యమైన విద్యను అందించి, బంగారు భవిష్యత్‌ను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. గ్రామంలోని ప్రతి ఒక్కరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని కోరారు. కార్యక్రమంలో ఆరుట్ల పాఠశాల ఎస్‌ఎంసీ కమిటీ సభ్యులు కంభాలపల్లి భాస్కర్, మండల మాజీ కో– ఆప్షన్ సభ్యులు ఎం.డీ. సలాం, యూసుఫ్ బాయ్, మైనార్టీ ముస్లిం నాయకులు ఖాజాబాయ్, గాలిబ్‌బాయ్, షబ్బిర్‌బాయ్, జంజీర్‌బాయ్, సద్దాం, ఖలీల్, జహీర్ తదితరులు పాల్గొన్నారు.