
రండి.. సర్కారు బడిలో చేరండి
షాబాద్: ‘సర్కారు బడి పిలుస్తోంది.. రా.. కదిలిరా..’ అంటూ ఉపాధ్యాయులు సాదరంగా ఆహ్వానిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచడానికి ముందస్తు బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈసారి సర్కారు స్కూళ్లలో మంచి ఫలితాలు రావడంతో ప్రతి ఏడాది జూన్‌లో నిర్వహించే బడిబాట కార్యక్రమాన్ని ఈసారి ఏప్రిల్ 23 నుంచే మొదలు పెట్టారు. విద్యాశాఖ సూచనల మేరకు ఉపాధ్యాయులు ప్రచారంలో వేగం పెంచారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో జూన్ 6 నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మెగా ప్రోగ్రాం నిర్వహించనున్నారు.
ప్రైవేటుకు దీటుగా..
సర్కారు స్కూళ్లలో చదవడం ద్వారా ప్రయోజనాలు, అనుభవజ్ఞులైన టీచర్లు, ఉచిత యూనిఫాం, పుస్తకాలు, మధ్యాహ్న భోజనం.. ఇలా అన్ని ఉపయోగాలను ప్రజలకు వివరిస్తూ ప్రైవేటుకు దీటుగా టీచర్లు ప్రచారం సాగిస్తున్నారు. తమ పాఠశాలలో విద్యార్థులు సాధించిన విజయాలను తల్లిదండ్రులకు వివరిస్తూ విద్యార్థులను చేర్పించేలా ప్రోత్సహిస్తున్నారు. గ్రామ పంచాయతీ, జన సమీకరణ ఉన్న ప్రాంతాల్లో స్వయం సహాయక బృందాల సభ్యులు, అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలు, పిల్లల తల్లిదండ్రులు, అంగన్‌వాడీల సహకారంతో కార్యక్రమాన్ని ముమ్మరం చేశారు. ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో మంచి ఫలితాలు రావడంతో తల్లిదండ్రులు కూడా సర్కార్ బడుల్లో తమ పిల్లలను చేర్పించేందుకు ముందుకు వస్తున్నారని ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు చెబుతున్నారు.
విద్యార్థుల సంఖ్యను
పెంచేలా ‘బడిబాట’
విస్తృత ప్రచారం చేస్తున్న ఉపాధ్యాయులు
తల్లిదండ్రులు ఆలోచించాలి
బడీడు పిల్లలందరినీ ప్రభుత్వ స్కూళ్లలో చేర్పించాలి. పేద, మధ్యతరగతి వారు ప్రైవేట్ మోజులో పడి ఫీజులు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవజ్ఞలైన ఉపాధ్యాయులు ఉన్నారు. తల్లిదండ్రులు విజ్ఞతతో ఆలోచించి సర్కారు బడుల్లో తమ పిల్లలను చేర్పించాలి. టీచర్లు మరింత అంకిత భావంతో పని చేసేలా చర్యలు చేపడతాం.
– లక్ష్మణ్‌నాయక్, ఎంఈఓ, షాబాద్

రండి.. సర్కారు బడిలో చేరండి