
పచ్చిరొట్ట పైర్లతో భూసారం పెంపు
మొయినాబాద్: రైతులు పంట మార్పిడి విధానాన్ని అవలంబించాలని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం శ్రాస్త్రవేత్త ఎస్‌జీ మహదేవప్ప అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని అజీజ్‌నగర్‌లో బుధవారం రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని నిర్వహించారు. నేల ఆరోగ్యం, నీటి వినియోగం, పర్యావరణ రక్షణపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పచ్చిరొట్ట పైర్లు సాగుచేసి భూమిలో కలియదున్నడంతో భూసారం పెరుగుతుందన్నారు. ఎరువులు, పురుగు మందుల వాడకాన్ని తగ్గించి ఖర్చులు తగ్గించాలని.. నీటి వృథాను అరికట్టేందుకు డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ విధానాలను అవలంబించాలన్నారు. పర్యావరణ రక్షణకు చెట్లను పెంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్త రమేష్, మండల వ్యవసాయాధికారి అనురాధ, ఏఈఓ సునీల్‌కుమార్, సీనియర్ నాయకుడు నర్సింహారెడ్డి పాల్గొన్నారు.
వ్యవసాయ వర్సిటీ శాస్త్రవేత్త
ఎస్‌జీ మహదేవప్ప