
ఎవరికీ లంచాలివ్వొద్దు
ఇబ్రహీంపట్నం: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఎవరికీ లంచాలు ఇవ్వొద్దని.. ఎవరైనా ఇబ్బంది పెడితే నేరుగా తనకు ఫోన్ చేయాలని ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి అన్నారు. మున్సిపల్ పరిధిలోని పథకం లబ్ధిదారులకు బుధవారం మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజాభవన్‌లో ఆయన మాట్లాడుతూ.. పేదోల్లంతా మనోల్లే.. ఆ పార్టీ, ఈ పార్టీ అనే తారతమ్యాలు లేకుండా రాజకీయాలకు అతీతంగా లబ్ధిదారులను ఎంపిక చేశామని తెలిపారు. ఇళ్లు మంజూరైన వారు మూడు నెలల్లో నిర్మాణం పూర్తి చేసుకోవాలని సూచించారు. బేస్మెట్ పూర్తవగానే రూ.లక్ష, గోడలు కట్టిన తర్వాత మరో రూ.లక్ష, స్లాబ్ వేశాక రూ.2 లక్షలు, నిర్మాణం పూర్తవగానే మరో రూ.లక్ష ఇలా నాలుగు విడతల్లో బిల్లులు వస్తాయని వివరించారు. కొలతలు, ఇంటి నిర్మాణం ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉండాలన్నారు.
హామీలను నెరవేరుస్తున్నాం..
గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని ఎమ్మెల్యే మండిపడ్డారు. అయినప్పటికీ పేదలకు ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ. 500లకే గ్యాస్ సిలిండర్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి హామీలను నెరవేరుస్తున్నారని తెలిపారు. ఐదేళ్ల కాలంలో నియోజకవర్గం వ్యాప్తంగా 20 వేల ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో అనంతరెడ్డి, హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ చాంప్లానాయక్, ఎంపీడీఓ యెల్లంకి జంగయ్యగౌడ్, మున్సిపల్ కమిషనర్ రవీంద్రసాగర్, మార్కెట్ కమిటీ చైర్మన్ కంబాలపల్లి గురునాథ్‌రెడ్డి, వైస్ చైర్మన్ మంఖాల కరుణాకర్, పీఏసీఎస్ చైర్మన్ పాండు రంగారెడ్డి, అధికారులు, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.
ఇబ్బంది పెడితే నేరుగా ఫోన్ చేయండి
ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాల అందజేత