
ఏపీఎంపై డీఆర్‌డీఓకు ఫిర్యాదు
నందిగామ: నందిగామ మండల మహిళా సమాఖ్యలో ఏపీఎంగా పనిచేస్తున్న యాదగిరి నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని, ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని సీసీ యాదయ్య జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. వీర్లపల్లి సంఘంలో ఎలాంటి తీర్మానాలు లేకుండా రూ.3 లక్షలు చెక్కురూపంలో నిధులను మళ్లించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదే క్లస్టర్‌లో సీసీగా పనిచేస్తున్న తనకు ఈ విషయం తెలియడంతో ఏపీఓను ప్రశ్నించగా తననే దూషించారన్నారు. ఈ విషయమై డీఆర్‌డీఓకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దీనిపై ఏపీఎం యాదగిరిని వివరణ కోరగా.. అందులో తన ప్రమేయం లేదని, బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని, నిజానిజాలు విచారణలో తేలుతాయని స్పష్టంచేశారు.
ఇబ్రహీంపట్నం ఎస్‌ఐపై వేటు
ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం ఎస్‌ఐగా పనిచేస్తున్న శ్రీనివాస్‌పై వేటు పడింది. ఆయనను మల్టీజోన్ రేంజ్ ఆఫీస్‌కు సరెండర్ చేస్తూ పోలీసు శాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. 2022లో మంచాల ఎస్‌ఐగా విధులు నిర్వర్తించిన శ్రీనివాస్ ఓ యాక్సిడెంట్ కేసును తప్పుదోవ పట్టించారనే ఆరోపణలపై, విచారణ అనంతరం శాఖాపరమైన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈక్రమంలో రెండు రోజుల క్రితమే ఆయన ఇబ్రహీంపట్నం పీఎస్ నుంచి రిలీవ్ అయినట్లు సమాచారం.
కడ్తాల్ ఎస్‌ఐకి ఉత్తమ పోలీసు అధికారి అవార్డు
కడ్తాల్: నేర పరిశోధన విభాగం 2024 సంవత్సరానికి సంబంధించి, రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన కడ్తాల్ ఎస్‌ఐ వరప్రసాద్ ఉత్తమ పోలీస్ అధికారిగా అవార్డు అందుకున్నారు. పీఎస్ పరిధిలో నమోదైన పలు కేసులను వేగంగా దర్యాప్తు చేయడంతోపాటు ఉత్తమ సేవలకు గానూ బుధవారం డీజీపీ జితేందర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. బెస్ట్ ఎస్‌ఐ వరప్రసాద్‌తో పాటు బెస్ట్ హోంగార్డుగా అవార్డు తీసుకున్న పాండును సీఐ గంగాధర్, పోలీసులు అభినందించారు.
ప్రేమ పేరుతో మోసం
సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి రిమాండ్
ఇబ్రహీంపట్నం రూరల్: ప్రేమ, పెళ్లి పేరుతో యువతిని మోసం చేసిన ఓ వ్యక్తిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఆదిబట్ల సీఐ రాఘవేందర్‌రెడ్డి కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరువూరుకు చెందిన దుబ్బాక సాగరిక ఆదిబట్ల టీసీఎస్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పని చేస్తున్నారు. 2022లో కోల్‌కటా టీసీఎస్‌లో పని చేసిన సమయంలో సహోద్యోగి పత్లావత్ సంజీవతో ఆమెకు పరియచం ఏర్పడింది. ప్రస్తుతం వీరిద్దరూ ఆదిబట్ల టీసీఎస్‌లో ఉద్యోగం చేస్తూ సహజీవనంలో ఉన్నారు. ఈక్రమంలో సాగరిక గర్భం దాల్చింది. దీంతో సంజీవ ఆమెకు బలవంతంగా అబార్షన్ చేయించాడు. అనంతరం పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో మొహం చాటేశాడు. ఈ విషయమై బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, బుధవారం అతన్ని మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చి రిమాండ్‌కు తరలించారు. సాగరికకు అబార్షన్ చేసిన తుర్కయంజాల్‌లోని మహోనియా ఆస్పత్రి యాజమాన్యంపై కూడా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తునట్లు తెలిపారు.
జనావాసాల్లోకి వచ్చి..
గేటులో తల ఇరుక్కుని
కుల్కచర్ల: జనావాసాల్లోకి వచ్చిన ఓ జింక ప్రహరీకి ఏర్పాటు చేసిన గేటులో తల ఇరుక్కపోయి ప్రజలకు చిక్కింది. ఈ ఘటన చౌడాపూర్ మండలంలో బుధవారం చోటుచేసుకుంది. అధికారులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కల్మన్‌కాల్వ అటవీ ప్రాంతం నుంచి సాయంత్రం ఓ జింక మరికల్ సమీపంలోని రామాలయం వద్దకు వచ్చింది. అక్కడ ఓ వ్యక్తి తన స్థలానికి ప్రహరీ నిర్మించి గేటు ఏర్పాటు చేశాడు. అందులో జింక తల పెట్టి చిక్కుకుపోయింది. గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని గేటుకు ఉన్న ఇనుప చువ్వలను తొలగించి జింకను మహబూబ్‌నగర్‌లోని పిల్లలమర్రి పార్కుకు తరలించామని బీట్ ఆఫీసర్ ఆంజనేయులు తెలిపారు.

ఏపీఎంపై డీఆర్‌డీఓకు ఫిర్యాదు