కుర్చీలాట!
ఏప్రిల్ నెలాఖరున పదవీ విరమణ చేసిన సీఈఐజీ
● సీటు దక్కించుకునేందుకు పోటాపోటీగా ప్రయత్నాలు ● కాసుల వర్షం కురిపిస్తుండడంతో భారీగా డిమాండ్ ● ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారుల చుట్టూ ప్రదక్షిణలు
సాక్షి, రంగారెడ్డిజిల్లా: విద్యుత్ ప్రమాదాల నియంత్రణలో కీలకంగా వ్యవహరించాల్సిన తెలంగాణ ప్రధాన విద్యుత్ తనిఖీ అధికారి (సీఈఐజీ) కార్యాలయంలో కుర్చీలాట మొదలైంది. ఇప్పటికే అడ్డదారిలో వచ్చి అడ్డగోలు వసూళ్లకు పాల్పడిన సీఈఐజీ ఏప్రిల్ నెలాఖరున పదవీ విరమణ చేశారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఈ కుర్చీని చేజిక్కించుకునేందుకు ఎవరికి వారు పోటీపడుతున్నారు. ఆశావహులు ప్రభుత్వ పెద్దలు, సచివాలయ కేంద్రంగా పని చేస్తున్న ఉన్నతాధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇప్పటికే ఓ డిప్యూటీ ఎలక్ట్రికల్ ఇన్‌స్పెక్టర్ అడ్డదారిలో ఎలక్ట్రికల్ ఇన్‌స్పెక్టరేట్‌గా పదోన్నతి పొందినట్లు తెలిసింది. ఈ విషయం మరో డిప్యూటీ డీఈకి తెలిసి కోర్టు ద్వారా ఈ చర్యను అడ్డుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇందుకు సదరు డిప్యూటీ ఈఐ రూ.కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.
అసలేం జరుగుతోంది?
భారీ బహుళ అంతస్తుల భవనాలు, సినిమా హాళ్లు, హోటళ్లు, పరిశ్రమల్లో విద్యుత్ ప్రమాదాల నియంత్రణ కోసం ప్రభుత్వం తెలంగాణ ప్రధాన విద్యుత్ తనిఖీ విభాగాన్ని 1987లో ఏర్పాటు చేసింది. 15 మీటర్ల ఎత్తున్న భవనాలు సహా 70 కిలోవాట్స్ సామర్థ్యానికి మించి విద్యుతత్‌్ డిమాండ్ ఉన్న ప్రతి కనెక్షన్స్ వీరి అనుమతి తప్పనిసరి చేసింది. ఈ నిబంధనే వారికి కాసుల వర్షం కురిపిస్తోంది. ప్రస్తుతం ఇక్కడ ప్రభుత్వ ప్రధాన విద్యుత్ తనిఖీ అధికారి (సీఈఐజీ)తో పాటు హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి–1,2,3 డివిజన్లు, మెదక్–1,2 డివిజన్లు, మహబూబ్‌నగర్, నిజామాబాద్ డివిజన్లకు ఒక్కో డిప్యూటీ డీఈ ఇన్‌చార్జిగా పని చేస్తున్నారు. వీరితో పాటు హైదరాబాద్, నిజామాబాద్‌కు ఇద్దరు ఈఐలు ఉన్నారు. లైసెన్సింగ్ బోర్డు కార్యదర్శి, పది మంది డీఈలు, ముగ్గురు ఏఈలున్నారు. 2018 నుంచి ప్రభుత్వం ఎలాంటి నియామకాలు చేపట్టలేదు. సీఈఐజీ సహా ఇతర కీలక పోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయి. డిప్యూటీ సీఈఐజీ స్థాయి అధికారే ఇప్పటి వరకు వీటికి ఇన్‌చార్జి సీఈఐజీగా వ్యవహరిస్తూ వచ్చారు. ఆయన కూడా ఉద్యోగ విరమణ చేయడంతో ఆయా కీలక పోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయి. బిల్డర్లు, పరిశ్రమల యజమానులు థర్డ్‌పార్టీ కాంట్రాక్టర్లతో విద్యుత్ పనులు చేయిస్తుంటారు. వీరు నాలుగు రాళ్లు వెనుకేసుకోవాలనే ఉద్దేశంతో ఐఎస్‌ఐ సర్టిఫైడ్ విద్యుత్ పరికరాలకు బదులు మార్కెట్లో తక్కువ ధరకు లభించే నాసిరకం కేబుళ్లు, ఎంసీబీలు, బ్రేకర్లు, ఆర్సీసీబీలు, ఎర్తింగ్స్ రాడ్స్ వాడుతున్నారు. భవిష్యత్తు అవసరాల మేరకు లైన్లు, కేబుళ్లు, ఎంసీబీలు వాడకపోవడంతో కొద్ది రోజులకే ష్టార్‌సర్క్యూట్ తలెత్తి అగ్ని ప్రమాదాలకు కారణమవుతున్నారు. దీంతో రూ.కోట్ల ఆస్తి నష్టంతో పాటు విలువైన ప్రాణాలను కోల్పోవాల్సి వస్తోంది.
ఆ లింకును తొలగించండి
2020 నవంబర్ నుంచి 2025 ఏప్రిల్ 25 నాటికి టీఎస్‌ఐపాస్ ద్వారా 13,453 దరఖాస్తులు రాగా, వీటిలో 12,609 దరఖాస్తులను ఆమోదించారు. ఇదే సమయంలో జనరేటర్ల ఏర్పాటు కోసం 1,072 దరఖాస్తులు రాగా, వీటిలో 994 ఆమోదించారు. 93 సినిమా థియేటర్ల దరఖాస్తుల్లో 83 ఆమోదించారు. దరఖాస్తు సహా సీఈఐజీ తనిఖీ, ఽఽఅనుమతి ధ్రువీకరణ పత్రం జారీ కోసం రూ.10 వేల లోపే ఫీజు నిర్ణయించింది. దరఖాస్తు చేసిన 14 రోజుల్లోనే ఆమోదించడమో, తిరస్కరించడమో చేయాలి. కానీ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్లు మొదలు, సీఈఐజీ వరకు ఎవరి స్థాయిలో వారు ఫైళ్లను రోజుల తరబడి తొక్కిపెడుతున్నారు. బిల్డింగ్ విద్యుత్ లైన్స్ డ్రాయింగ్స్ మొదలు టీఎస్‌బీపాస్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయడం, క్షేత్రస్థాయిలో తనిఖీలు, ఆమోదం వరకు ఇలా భవన నిర్మాణ సామర్థ్యం/ పరిశ్రమ సామర్థ్యాన్ని బట్టి.. ఒక్కో ఫైలుకు ఒక్కో ధర నిర్ణయించి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. సాఫ్ట్‌వేర్ సంస్థలు, పరిశ్రమలు, అపార్ట్‌మెంట్లు, సోలార్ ప్లాంట్ల నుంచి భారీగా వసూలు చేస్తున్నారు. తర్వాత పీరియాడికల్ ఇన్‌స్పెక్షన్ పేరుతోనూ వసూలు చేస్తున్నారు. ఇచ్చేందుకు నిరాకరించిన వారి ఫైళ్లకు రకరకాల కొర్రీలు పెట్టి తిప్పిపంపు తున్నారు. సీఈఐజీ ఇన్‌స్పెక్టర్ల అక్రమ వసూళ్లతో విద్యుత్ సంస్థల్లో పని చేసే ఇంజినీర్లు చెడ్డపేరు మూటకట్టుకోవాల్సి వస్తోంది. ఏపీ సహా ఇతర రాష్ట్రాల్లో మాదిరి హెచ్‌టీ విద్యుత్ కనెక్షన్లకు సీఈఐజీ లింకును తొలగించాల్సిందిగా కోరుతూ ఇటీవల డిస్కం ఇంధనశాఖ ముఖ్య కార్యదర్శికి లేఖ రాయడం, ఇదే అంశంపై ఇటీవల సంబంధిత ఇన్‌స్పెక్టర్లతో సచివాలయ కేంద్రంగా సమావేశం నిర్వహించడం కొసమెరుపు.


