
‘లక్ష’ణమైన కాడెడ్లు!
యాచారం: మరో ఇరవై రోజుల్లో వానాకాలం సీజన్ ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో కాడెడ్ల ధరలు భగ్గుమంటున్నాయి. వర్షాలు కురిస్తే ఇవి మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. దీంతో రైతులు మంగళవారం మాల్ సంతకు క్యూకట్టారు. ఆరడుగులకు పైగా ఎత్తున్న కాడెడ్లు ఇక్కడ అమ్మకానికి వచ్చాయి. ఎక్కువ విస్తీర్ణంలో వాణిజ్య పంటలు సాగు చేసే రైతులు పెద్ద ఎడ్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపారు. పత్తి, మిర్చి, కంది పంటల్లో నిత్యం 10గంటలు పనిచేయగలిగే సామర్థ్యం వీటి సొంతం. కడుపునిండా మేత, నీళ్లు ఉంటే అలసట లేకుండా పనిచేస్తాయి. నల్గొండ జిల్లా హలియా, దేవరకొండ, మిర్యాలగూడ, మర్రిగూడ తదితర ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో కాడెద్దులు విక్రయానికి వచ్చాయి. మాల్ పశువుల సంతలో ఒక్కో కాడెద్దుల జత రెండున్నర లక్షలకు పైగానే పలికింది. ఆరడుగులకు పైగా ఎత్తు, తెల్లటి రంగున్న కోడెలు, ఎద్దులు అందరి చూపులను ఆకర్షించాయి. ధృడంగా కనిపించిన వాటిని కొనుగోలు చేసేందుకు ఎక్కువ మంది మొగ్గు చూపారు. ఏపీలోని మాచర్ల, మార్కాపురం, నరసరావుపేట, చిలకలూరిపేట తదితర ప్రాంతాల్లోని రైతులు ఇక్కడకు వచ్చి కొనుగోలు చేసి తీసుకెళ్లారు. మోతుబరి రైతులు ధరను పట్టించుకోకుండా వారికి నచ్చినవి కొన్నారు.
25శాతం కబేళాకే
సాగుకు చేతకాని పశువులు, ఎద్దులతో పాటు వీటిని సాకలేని పలువురు రైతులు కబేళాకు విక్రయించారు. మంగళవారం సంతకు వచ్చిన మూగజీవాల్లో సుమారు 25శాతం కబేళాకే తరలిపోయాయి. నగరానికి చెందిన వ్యాపారులు వీటిని కొనుగోలు చేసి తీసుకెళ్లారు. వయసు పైబడిన వాటిలో ఎక్కువగా వీరే కొనుగోలు చేశారు.
మాల్ సంతలో జోరుగా క్రయవిక్రయాలు
వానాకాలం నేపథ్యంలో కొనుగోలుకు ఆసక్తి చూపిన రైతులు

‘లక్ష’ణమైన కాడెడ్లు!