
మార్కెట్ ధరకు మూడు రెట్ల పరిహారం
● ఎవరికీ అన్యాయం చేయం ● జీవనోపాధి కోల్పోయిన వారికి ఆర్‌ఎన్‌ఆర్ ప్యాకేజీ ● కొంగరకలాన్ గ్రామసభలో అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ ● సర్వేసక్రమంగా చేపట్టడం లేదని రైతుల ఆగ్రహం
ఇబ్రహీంపట్నం రూరల్: ప్రజాభిప్రాయం మేరకే అధికారులు పని చేస్తారని.. పరిహారం విషయంలో ఎవరికీ జరగనీయమని ప్రభుత్వ నిర్ణయం మేరకు నడుచుకుంటామని అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. వంద మీటర్ల గ్రీన్ ఫీల్డ్ రేడియల్‌రోడ్డు ప్రాజెక్టు నిర్మాణం నిమిత్తం రావిర్యాల నుంచి మీరాఖాన్‌పేట వరకు 18 కిలోమీటర్ల రోడ్డు భూసేకరణ నష్టపరిహారం, పునరావస, పునరుపాధి కల్పనకు ఆదిబట్ల మున్సిపల్ పరిధిలోని కొంగరకలాన్‌లో గ్రామసభ నిర్వహించారు. భూసేకరణ శాఖ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహిస్తుండగా రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. సర్వే సక్రమంగా లేదని మండిపడ్డారు. ప్రభుత్వం పటేళ్ల విషయంలో ఒక విధంగా గొల్లకుర్మల విషయంలో మరోలా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ భూములు వదిలి పట్టా భూములు ఎందుకు సేకరిస్తున్నారని నిలదీశారు. కబ్జాల్లో ఉన్న వారి పేర్లు జాబితాలో నమోదు చేయాలన్నారు. పొజీషన్‌లో ఉండి పేపర్లు లేని రైతులకు న్యాయం చేయాలన్నారు. ప్రశ్నించి సమావేశం నుంచి వెళ్లిన రైతులను అధికారులు మళ్లీ పిలిపించుకున్నారు.
ప్రభుత్వ నిర్ణయం మేరకే పని చేస్తాం:
అడిషనల్ కలెక్టర్ ప్రతిమాసింగ్
గ్రీన్‌ఫీల్డ్ రోడ్డుకు జీవనోపాధి కోల్పోయిన వారికి ఆర్‌ఎన్‌ఆర్ ప్యాకేజీ ఇచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. వారికి పునరావాసం కల్పించి ఉపాధి చూపుతుందన్నారు. ఇంటి యజమానితో పాటు ఇంట్లో 18 ఏళ్లు దాటిన వారి అందరికీ ఒక్కొక్కరికి రూ.5.50లక్షల చొప్పున చెల్లిస్తుందన్నారు. మార్కెట్ ధరకు మూడు రెట్లు పరిహారం ఇస్తామన్నారు. పబ్లిక్ ఇయరింగ్, డిక్లరేషన్ పూర్తవ్వగానే కలెక్టర్ పరిహారం ప్రకటిస్తారని చెప్పారు. రైతులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి లేదన్నారు. అందరికి న్యాయం చేసే విధంగా చర్యలు చేపడతామన్నారు.
గ్రామసభ సమాచారం లేదు
గ్రామసభ పెడుతున్నట్లు రైతులకు సమాచారం లేదు, బహిరంగంగా టెంటు వేయకుండా పోలీసులను పెట్టుకుని లోపల గ్రామసభ పెట్టుకోవడం ఏమిటని భూసేకరణ అధికారి రాజును రైతులు నిలదీశారు. రైతులకు సమాచారం ఇవ్వాల్సింది పోయి ఒక్కరోజు ముందు సాయంత్రం నోటీసులు పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమగ్ర సమాచారంతో సభలు పెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీటీలు శ్రీనివాస్ ,విజయ్‌కుమార్, తేజేశ్వర్‌రెడ్డి, రైతులు పాల్గొన్నారు.
‘కేన్స్’రైతులను ఆదుకోండి
సర్వే నెంబరు 300లో కేన్స్ సంస్థ కోసం భూములు కోల్పోయిన 11 మంది రైతులకుపరిహారం నేటికి అందలేదని, ఫాక్స్‌కాన్‌లోనూ ఇదే పరిస్థితి ఉందని కోశిక కోటయ్య, యాదయ్య అడిషనల్ కలెక్టర్ ప్రతిమాసింగ్‌కు చెప్పారు. వెంటనే వివరాలు ఇవ్వాలని ఆర్‌ఐ పుష్పలతకు సూచించారు. ఎక్కడ లోపం ఉంది, ఎందుకు పరిహారం రాలేదో పరిశీలించి చెబుతానన్నారు.

మార్కెట్ ధరకు మూడు రెట్ల పరిహారం