విద్యుత్ మీటర్ల కొను‘గోలుమాల్’
ధ్రువీకరణ పత్రాలు, నిర్మాణాలు లేకపోయినా జారీ
అక్రమంగా 42 విద్యుత్ మీటర్లు..
ఇంట్లో అక్రమంగా దాచిన 42 విద్యుత్ మీటర్లను విద్యుత్ శాఖ అధికారుల ఫిర్యాదుపై రాయదుర్గం పోలీసులు దాడులు చేసి స్వాధీనం చేసుకొని కాంట్రాక్టర్‌పై కేసు నమోదు చేశారు. రాయదుర్గం ఇన్‌స్పెక్టర్ సీహెచ్‌వెంకన్న తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. 24 గంటల్లో ఏర్పాటు చేయాల్సిన విద్యుత్ మీటర్లు ఇంట్లో అక్రమంగా దాచి ఉంచారని విద్యుత్ శాఖలోని సైబర్ సిటీ జోన్ ఇబ్రహీంబాగ్ డివిజన్ ఏడీఈ అంబేడ్కర్ రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు చిత్రపురి కాలనీలోని ఓ ఇంట్లో తనిఖీలు చేయగా 42 విద్యుత్ మీటర్లు దొరికాయి. కాంట్రాక్టర్ చెన్నకేశవరెడ్డిపై కేసు నమోదు చేశారు. మీటర్లు నిల్వ ఉంచడంపై సమగ్ర విచారణకు ఆదేశిస్తున్నట్లు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ రంగారెడ్డి జోన్ సీజీఎం పాండ్యా నాయక్ ప్రకటించారు.
సాక్షి, రంగారెడ్డిజిల్లా: విద్యుత్ మీటర్ల జారీ వ్యవహారం వివాదాస్పదంగా మారుతోంది. ఎలాంటి నిర్మాణాలు, భూమికి సంబంధించిన రికార్డులు లేకపోయినా క్షేత్రస్థాయి సిబ్బందికి అడిగినంత ఇస్తే చాలు మీటర్లు జారీ చేయిస్తున్నారు. విలువైన ప్రభుత్వ భూముల అన్యాక్రాంతానికే కాదు.. ఆయా భూముల్లో అక్రమ నిర్మాణాలకు కారణమవుతున్నారు. ఇప్పటికే సరూర్‌నగర్ సర్కిల్ మునగనూరు సర్వే నంబర్ 90లో 6.28 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసి, 54 తాత్కాలిక ఇళ్లను నిర్మించారు. ఈ అక్రమ నిర్మాణాలకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ విద్యుత్ మీటర్లు మంజూరు చేయడంతో స్థానికంగా ఓ వ్యక్తి హైకోర్టును ఆశ్రయించగా, విద్యుత్ శాఖ అధికారులకు నోటీసులు జారీ చేసింది. తాజాగా దుండిగల్, రాయదుర్గం పోలీసు స్టేషన్ల పరిధిలోనూ పెద్ద సంఖ్యలో విద్యుత్ మీటర్లు బయటపడటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డిస్కం రిలీజ్ చేసిన 24 గంటల్లోనే సంబంధిత దరఖాస్తుదారు నివాస గృహం/వాణిజ్య భవనానికి క్షేత్రస్థాయి సిబ్బంది నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపంతో నెలలు గడుస్తున్నా అమర్చడం లేదు. కానీ.. మరుసటి నెల నుంచే ఆయా మీటర్లకు రీడింగ్ నమోదు చేసినట్లు రికార్డులు చూపిస్తూ ప్రతి నెలా మినిమం బిల్లులు జారీ చేస్తున్నారు.


