
పకడ్బందీగా ‘భూ భారతి’
కొత్తూరు/నందిగామ: భూముల రికార్డుల్లో ఎలాంటి వివాదాలకు తావు లేకుండా పారదర్శకమైన రికార్డుల నిర్వహణ కోసం తెలంగాణ ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందని కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. కొత్తూరు, నందిగామ మండలాల్లో శనివారం నిర్వహించిన భూ భారతి అవగాహన సదస్సుల్లో ఆయన మాట్లాడారు. ముందుగా ఇటీవల పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులు, మేధావులు, అధికారులు, ప్రతిపక్షాల సూచనలు, సలహాలతో భూ భారతి చట్టాన్ని రూపొందించినట్లు వివరించారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌తో రైతులు, వ్యాపారులు అనేక రకాలుగా ఇబ్బందులు పడినట్లు తెలిపారు. ప్రస్తుత చట్టంలో ఎలాంటి ఇబ్బందులు, ఆలస్యం, పొరపాట్లకు తావు లేకుండా రూపొందించినట్లు వివరించారు. గతంలో మాదిరిగా కాకుండా మండలస్థాయిలోనే సమస్యలను పరిష్కరించుకునే విధంగా చట్టం ఉందన్నారు. రిజిస్ట్రేషన్, విరాసత్, హక్కుల బదలాయింపు తదితర సేవలు మరింత పకడ్బందీగా అందుతాయన్నారు. త్వరలో గ్రామాల వారీగా రెవెన్యూ సదస్సులు నిర్వహించి రికార్డులను సరిచేయడంతో పాటు వివాదాలను పరిష్కరించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, ఆర్డీఓ సరిత, తహసీల్దార్‌లు రవీందర్‌రెడ్డి, రాజేశ్వర్, ఎంపీవోలు అరుంధతి, సుమతి, ఇతర నాయకులు పాల్గొన్నారు.
కలెక్టర్ నారాయణరెడ్డి