పహాడీషరీఫ్: మదర్సాలో ఉండే బాలుడు అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం.. సయ్యద్ సుల్తాన్ కుమారుడు సోల్‌మాన్(15) సైదాబాద్‌లోని జువైనల్ హోంలో ఉండడంతో, ఫౌజియా బేగం అనే సోషల్ వర్కర్ బాలుడితో పాటు మరో నలుగురిని జల్‌పల్లి కమాన్ రోడ్డు సమీపంలోని మదర్సాలో చేర్పించి విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు. ఈ నెల 24న ఉదయం సోల్‌మాన్ ఎవరికీ చెప్పకుండా బయటికి వెళ్లిపోయాడు. ఈ విషయమై ఫౌజియా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. బాలుడి ఆచూకీ తెలిసిన వారు 87126 62367 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.
ప్రేమ వివాహం చేసుకున్న యువకుడి ఇంటిపై దాడి
ఇబ్రహీంపట్నం: ప్రేమ వివాహం చేసుకున్న యువకుడి ఇంటిపై అమ్మాయి తరఫు బంధువులు దాడి చేసిన సంఘటన ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ శ్రీనివాస్ కథనం ప్రకారం.. రాయపోల్ గ్రామానికి చెందిన అచ్చన మహేశ్ (21), కావ్యశ్రీ(19) ప్రేమించుకున్నారు. రెండు రోజుల క్రితం ఇంట్లో నుంచి పారిపోయి వివాహం చేసుకున్నారు. ఇది ఇష్టం లేని కావ్యశ్రీ తల్లిదండ్రులు, బంధువులు మంగళవారం మహేశ్ ఇంట్లోకి ప్రవేశించారు. మహేశ్ అక్క మౌనికపై దాడి చేయడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు అమ్మాయి తల్లిదండ్రులతోపాటు 16 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.