
అప్రమత్తతే శ్రీరామరక్ష
● అగ్గి రాజుకుంటే బుగ్గే..
● పరిశ్రమల్లో తరచూ అగ్నిప్రమాదాలు
● వేసవి వేళ జాగ్రత్తలు ముఖ్యం
● ఎప్పటికప్పుడు తనిఖీలు చేసుకోవాలి
● సూచిస్తున్న అగ్నిమాపక సిబ్బంది
షాద్‌నగర్: వేసవి కాలం ప్రారంభమైంది.. అగ్ని ప్రమాదాలు జరిగేందుకు ఆస్కారం ఉంది. అప్రమత్తంగా ఉండకుంటే భారీ నష్టాన్ని చవిచూడాల్సి ఉంటుంది. అగ్నిమాపక కేంద్రాలు ఉన్నా సంఘటనా స్థలానికి చేరుకునేలోపు ఉన్న ఆస్తి కాస్తా అగ్నికి ఆహుతయ్యే అవకాశం ఉంది. వేసవి నేపథ్యంలో పరిశ్రమల వర్గాలు, వ్యాపారులు మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచిస్తున్న అగ్నిమాపక సిబ్బంది.
తరచూ ప్రమాదాలు
షాద్‌నగర్ నియోజకవర్గం పరిధిలోని కొత్తూరు, నందిగామ, షాద్‌నగర్ ప్రాంతాల్లో సుమారు 350కి పైగా పరిశ్రమలు ఉన్నాయి. 50 వేలకు పైగా కార్మికులు పని చేస్తున్నారు. అగ్ని ప్రమాదాలు ముఖ్యంగా కాటన్, జిన్నింగ్, ఆయిల్, హెర్చల్ పరిశ్రమల్లో అధికంగా జరుగుతున్నాయి. కోట్లాది రూపాయల ఉత్పత్తులు, యంత్రాలు అగ్నికి ఆహుతి అవుతున్నాయి. పరిశ్రమల్లో పని చేసే కార్మికులు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక భయంతో పని చేయాల్సి వస్తోంది. 11 నెలల క్రితం నందిగామలో పాత జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న అలైన్ ఫార్మా హెర్బల్ పరిశ్రమలో వెల్డింగ్ చేస్తుండగా నిప్పు రవ్వలు స్పాంజ్, థర్మాకోల్ షీట్లపై పడటంతో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఐదు నెలల క్రితం అన్నారం గ్రామ శివారులోని ఆయిల్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరిగి భారీ నష్టం వాటిల్లింది. ఇటీవల బైపాస్ రోడ్డులో వ్యర్థాలకు గుర్తు తెలియని వారు నిప్పంటించారు. గతంలో మొగిలిగిద్ద గ్రామ శివారులో రబ్బర్ పరిశ్రమలో అగ్నిప్రమాదం జరిగి రూ.లక్షల్లో ఆస్తి నష్టం జరిగింది. షాద్‌నగర్ శివారులోని బైపాస్ జాతీయ రహదారిపై వెళ్తున్న కారు నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైన ఘటనలు ఉన్నాయి. భారీ ప్రమాదాలు జరిగితే షాద్‌నగర్ ఉన్న అగ్నిమాపక శకటాలతో పాటు, శంషాబాద్, రాజేంద్రనగర్, జడ్చర్ల తదితర ప్రాంతాల నుంచి శకటాలను రప్పించి మంటలను ఆర్పేస్తున్నారు.
మంటలు ఆర్పేందుకు సిద్ధంగా ఉండాలి..
వేసవి కాలం ప్రారంభం కావడంతో తరచూ అగ్ని ప్రమాదాలు జరుగుతుంటాయి. పరిశ్రమల్లో, వ్యాపార సముదాయాల్లో ఎక్కువగా ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయి. పరిశ్రమల నిర్వాహకులు, వ్యాపారస్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అగ్నిమాపక శాఖ వారు సూచిస్తున్నారు. మంటలను ఆర్పేందుకు విధిగా మంచినీటిని అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా చాలా పరిశ్రమల్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదాలు జరుగుతుంటాయి. యంత్రాలకు సంబంధించిన విద్యుత్ వైర్లు సరిగా ఉన్నాయో లేదో ఎప్పటికప్పుడు తనిఖీ చూసుకోవాలని చెబుతున్నారు.
సత్వరం సమాచారం ఇవ్వాలి
వేసవి కాలం పరిశ్రమలు, వ్యాపారాలు నిర్వహించే వారు అప్రమత్తంగా ఉండాలి. నీరు అందుబాటులో ఉంచుకోవాలి. ప్రమాదం సంభవించిన వెంటనే పోలీసు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించాలి. వెంటనే మంటలు ఆర్పేందుకు చర్యలు తీసుకుంటాం.
– జగన్, స్టేషన్ ఫైర్ ఆఫీసర్, షాద్‌నగర్ అగ్నిమాపక కేంద్రం

అప్రమత్తతే శ్రీరామరక్ష

అప్రమత్తతే శ్రీరామరక్ష