ఆస్తుల పరిరక్షణకు..
ఈ సర్వేతో అంగుళం స్థలం కూడా కబ్జా కాదు
సాక్షి, సిటీబ్యూరో: సంస్థ ఆస్తుల పరిరక్షణ, అక్రమాల కట్టడికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటున్న జీహెచ్‌ఎంసీ మరో ముందడుగు వేయనుంది. జీహెచ్‌ఎంసీకి సంబంధించి ఎన్నో ఆస్తులున్నాయి. వాటిపై తగిన శ్రద్ధ, పర్యవేక్షణ లేకపోవడంతో కమ్యూనిటీ హాళ్ల నుంచి పార్కుల దాకా ఇప్పటికే ఎన్నో కబ్జాలు జరి గాయి. పలు ఆస్తులు ఆక్రమణదారుల పరమయ్యాయి. వీటితో పాటు లే ఔట్లలోని ప్రభుత్వ స్థలాలు తదితరాలు సైతం బడాబాబులకు కాసులు కురిపించే కల్పతరువులయ్యాయి. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ పరిధిలోని కార్పొరేషన్ ఆస్తులతోపాటు ప్రభుత్వ ఆస్తులు కూడా పరిరక్షించేందుకు, కబ్జాల పాలు కాకుండా ఉండేందుకు మరో ఆధునిక సాంకేతికతను వినియోగించుకునేందుకు జీహెచ్‌ఎంసీ సిద్ధమైంది. అదే డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (డీజీపీఎస్) సర్వే.
జీపీఎస్ కన్నా ఉత్తమం..
జీపీఎస్ గురించి అందరికీ తెలిసిందే. దానికంటే ఉన్నతమైనది డీజీపీఎస్. ఈ సర్వేతో ఆయా ఆస్తులు, స్థలాల సర్వే, మ్యాపింగ్ తదితర అంశాల్లో అంగుళం వరకు కచ్చితత్వం ఉంటుంది. ఇందులో రెండు జీపీఎస్ రిసీవర్లను వినియోగిస్తారు. నిర్ణీత ప్రదేశానికి సంబంధించి జీపీఎస్ సిగ్నల్స్‌కు, ఉపగ్రహం సూచించిన ప్రదేశానికిమధ్య ఉండే ఎర్రర్స్ ఫీల్డ్‌లోని మొబైల్ (రోవర్) డీజీపీఎస్ రిసీవర్లకు ట్రాన్స్‌మిట్ అవుతాయని అధికారులు పేర్కొన్నారు. ఈ విధానం వల్ల అంగుళం వరకు కచ్చితత్వం ఉంటుందని తెలిపారు. జీపీఎస్‌లో 10 నుంచి 15 మీటర్ల వరకు వ్యత్యా సముంటుందన్నారు. డీజీపీఎస్‌తో అంగుళం స్థలం కూడా తేడా రాకుండా కచ్చితంగా తెలుస్తుందన్నారు. డీజీపీస్ సర్వేతో పార్కులు సహా జీహెచ్‌ఎంసీ ఆస్తులన్నింటినీ, ఆయా లే ఔట్లలోని ప్రభుత్వ స్థలాల్ని, మ్యాపింగ్ చేయనున్నారు.
ప్రయోగాత్మకంగా ఒక జోన్‌లో..
డీజీపీఎస్ సర్వేను తొలుత ఒక జోన్‌లో ప్రయోగాత్మకంగా చేపట్టి, అనంతరం అన్ని జోన్ల లోనూ నిర్వహించాలని జీహెచ్‌ఎంసీ భావిస్తోంది. ఇప్పటికే పరుల పాలైన జీహెచ్‌ఎంసీకి చెందిన ఆస్తులు, పార్కులు, కమ్యూనిటీ హాళ్లు తదితరమైన వాటిని కూడా గుర్తించి పరిరక్షించాలనేది కార్పొరేషన్ లక్ష్యం. నగరంలో భూముల విలువ కోట్లలో ఉండటంతో అంగుళం స్థలం కూడా పోనివ్వకుండా ఉండేందుకు ఈ సర్వేకు సిద్ధమవుతున్నారు.
విద్యుత్ స్తంభాలకు సైతం ఐడీలు
ప్రతి రోడ్డుకూ ఒక ప్రత్యేక ఐడీ ఇవ్వాలని భావించిన జీహెచ్‌ఎంసీ అధికారులు ప్రజల నుంచి వె వెల్లువెత్తుతున్న విమర్శలతో విద్యుత్ విభాగంలోనూ ఆధునిక సాంకేతికతను వినియోగించుకునేందుకు సిద్ధమవుతున్నారు. అన్ని విద్యుత్ స్తంభాలు, కనెక్షన్లు, వినియోగిస్తున్న విద్యుత్ తదితరమైనవి పక్కాగా లెక్క తెలిసేలా స్తంభాలకు ఐడీలు, క్యూఆర్ కోడ్‌లు, పర్యవేక్షణకు యాప్స్ వంటివి వినియోగించనున్నారు. రోడ్ల చరిత్ర మాదిరే ఐడీతో స్తంభం ఏర్పాటు నుంచి దానికి అమర్చిన బల్బులు.. ఎంత కాలం పనిచేశాయి.. కొత్తవి ఎప్పుడు వేశారు? తదితర వివరాలన్నీ తెలుస్తాయని అధికారులు పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీపై ప్రజల నుంచి వెల్లువెత్తుతున్న విమర్శల్లో అక్రమాలకు సంబంధించి టౌన్‌ప్లానింగ్ విభాగం అగ్ర స్థానంలో ఉండగా, నిర్వహణ లేమిలో విద్యుత్ విభాగం ఉంది. చీకట్లో మగ్గుతున్నామని ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నా నిర్వహణలేమి, అక్రమాలతో పరిష్కారం కావడం లేదు. చేయబోయే పనులతో వాటికి తెర పడుతుందని భావిస్తున్నారు.
పార్కులు, లే ఔట్లు, ఇతర స్థలాలకు రక్షణ
టెక్నాలజీ వినియోగంలో జీహెచ్‌ఎంసీ మరో అడుగు
డీజీపీ‘ఎస్’