దౌల్తాబాద్: పల్లెల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం గ్రామసభలను నిర్వహిస్తోంది. కానీ క్షేత్రస్థాయిలో ప్రజల భాగస్వామ్యం లేకపోవడంతో ఇవి తూతూమంత్రంగా కొనసాగుతున్నాయి. అవగాహన కల్పి ంచాల్సిన అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. పంచాయతీల అభివృద్ధిలో గ్రామసభలు ఎంతో కీలకం. ఆయా శాఖల అధికారులతో పాటు పంచాయతీ పాలకవర్గం సభ్యులు, ప్రజలు ఇందులో పాల్గొని సమస్యలను గుర్తించి, పరిష్కార మార్గాలపై చర్చిస్తారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమ లు తీరు, లబ్ధిదారుల వివరాల నమోదును గ్రామ సభల ద్వారా నిర్వహిస్తారు. ప్రభుత్వాలు చేపట్టే కొత్త పథకాలు, పనులపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటారు.
నిర్వహణ ఇలా..
పంచాయతీల్లో ప్రతీ రెండు నెలలకు ఒకసారి సర్పంచ్ అధ్యక్షతన గ్రామ సభలు నిర్వహించాలి. అయితే ఏడాదిన కాలంగా సర్పంచ్‌లు లేకపోవడంతో కార్యదర్శులే నిర్వహి స్తున్నారు. సంబంధిత జీపీతో పాటు అనుబంధ గ్రా మాల్లో సభలు నిర్వహించే తేదీలను ముందుగానే ప్రకటించాలి. ఈ విషయమై సిబ్బందితో టాంటాం(దండోరా) వేయించాలి. నిబంధనల ప్రకారం విధిగా 17శాఖల అధికారులు జనాభాలో సుమారు 20శాతం మంది ప్రజలు గ్రామసభకు హాజరయ్యేలా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ ఇవేవీ పట్టించుకోవడం లేదు. కనీసం 50 మందితో గ్రామసభ నిర్వహించాలనే నిబంధనలు ఉన్నా పది మంది తో కానిచ్చేస్తున్నారు. పంచాయతీ ఆదాయ, వ్యయాలపైన కార్యదర్శులు నివేదికలు చదివి వినిపించాల్సి ఉన్నా ఎక్క డా అమలు కావడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఆసక్తి చూపని గ్రామస్తులు..
జిల్లాలోని చాలా చోట్ల నిర్వహించే గ్రామసభలకు కనీసం పది నుంచి ఇరవై మంది కూడా రావడంలేదు. ప్రజాప్రతినిధులు, అంగన్‌వాడీ టీచర్లు, వీఓఏలు, వైద్యసిబ్బంది మాత్రమే సభలకు హాజరవుతున్నారు. ప్రజలు, నాయకులకు సరైన సమాచారం ఉండటం లేదు. గ్రామ సభల్లో చర్చకు వచ్చే సమస్యలకు పరిష్కారం చూపితే వీటిపై గౌరవం పెరిగే అవకాశం ఉంటుంది. కానీ గ్రామాల్లో సమస్యలు పేరుకుపోవడం, సుదీర్ఘకాలంగా పరిష్కారం కాకపోవడం వంటి కారణాలతో సభలకు ఆదరణ తగ్గుతోంది.
కనిపించని ప్రజల భాగస్వామ్యం
అవగాహన కల్పించని అధికారులు
ప్రజల భాగస్వామ్యం పెరగాలి
గ్రామసభల్లో ప్రజల భాగస్వామ్యం మరింత పెరగాలి. సభల నిర్వహణపై కార్యదర్శులతో గ్రామాల్లో దండోరా వేయిస్తున్నాం. సమాచారం తెలుసుకుని స్వచ్ఛందంగా సభకు రావాలి. దీంతో సమస్యలు పరిష్కరించే వీలు కలుగుతుంది.
– శ్రీనివాస్, ఎంపీడీఓ, దౌల్తాబాద్