సీపీఎం మండల కార్యదర్శి శేఖర్
మహేశ్వరం: అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 17, 18 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ఎదుట నిర్వహిస్తున్న ధర్నా, వంటావార్పు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సీపీఎం మండల కార్యదర్శి ఏర్పుల శేఖర్ కోరారు. శనివారం మండల కేంద్రంలో సీడీపీఓ ప్రాజెక్టు కార్యాలయంలో అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లతో కలిసి ఆయన వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల సమస్యల పరిష్కారం కోసం సీపీఎం, సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా, వంటావార్పు కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఐసీడీఎస్‌ను నిర్వీర్యం చేసే పీఎం శ్రీ పథకాన్ని, మొబైల్ అంగన్‌వాడీ సెంటర్లను వెంటనే రద్దు చేయాలని, కేంద్ర ప్రభుత్వం తెచ్చిన విద్యా విధానం చట్టాన్ని అమలు చేయకుండా ఆపాలని డిమాండ్ చేశారు. అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. ఆయా నిరసన కార్యక్రమాల్లో ప్రతీ అంగన్‌వాడీ టీచర్, హెల్పర్లు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అంతకుముందు మండల కేంద్రంలో ఐసీడీఎస్ కార్యాలయంలో అధికారులకు సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు పాల్గొన్నారు.