
సిబ్బంది లేక.. సమస్యలు తీరక
మాడ్గుల: సిబ్బంది లేమితో ఎంపీడీఓ కార్యాలయం వెలవెలబోతోంది. ఫలితంగా వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలకు ఇబ్బంది తప్పడం లేదు. సకాలంలో పనులు గాక.. కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మాడ్గుల మండలంలో 34 గ్రామ పంచాయతీలున్నాయి. ఇంత పెద్ద మండల ప్రజలకు సేవలందించాల్సిన ఎంపీడీఓ కార్యాలయంలో సూపరింటెండెంట్, ఆపరేటర్, టైపిస్ట్, వాచ్‌మెన్ పోస్టులు ఖాళీగా ఉండటం శోచనీయమని మండల ప్రజలు పేర్కొంటున్నారు.
కష్టంగా కార్యాలయ నిర్వహణ
రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీలు అమలు చేస్తున్న విషయం విధితమే. అయితే పలు కారణాల వలన అర్హులకు సంక్షేమ పథకాలు అందడం లేదు. ఇలాంటి వాటి పరిష్కారం కోసం, అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాలన్న ఉద్దేశంతో ఎంపీడీఓ కార్యాలయంలో ప్రభుత్వం ప్రజాపాలన సేవా కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇక్కడ దరఖాస్తు చేసుకుంటే.. సమస్యకు పరిష్కారం దొరుకుతుందన్న ఆశతో ప్రజలు బారులు తీరుతున్నప్పటికీ.. ఆపరేటర్ లేక పోవడంతో నిరాశతో వెనుతిరుగుతున్నారు. పనులు మానుకొని 10, 15కిలో మీటర్ల దూరం నుంచి వస్తే.. తమ సమస్యలకు పరిష్కారం దొరకడం లేదని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. అధికారులు, సిబ్బంది లేకపోవడంతో ప్రజలకు ఇబ్బందిగా మారిందని, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ప్రజా సౌకర్యార్థం ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని కోరుతున్నారు. ఇదిలా ఉండగా.. సూపరింటెండెంట్ లేక.. కార్యాలయ నిర్వహణ కష్టంగా మారిందని ఉద్యోగులు పేర్కొనడం గమనార్హం.
మండల పరిషత్‌కార్యాలయంలో అన్నీ ఖాళీలే!
పరిష్కారానికి నోచుకోని సమస్యలు
ఇబ్బంది పడుతున్న ప్రజలు
జీతాలు రాక ఇబ్బంది
ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్నాను. ఉన్నతాధికారుల ఆదేశాలను పాటిస్తూ ఆపరేటర్‌గా ప్రజలకు సేవలు అందిస్తున్నా. కానీ ఐదు నెలలుగా జీతాలు రాక ఇబ్బంది పడుతున్నాం. ఉన్నతాధికారులు స్పందించి సకాలంలో వేతనాలు వచ్చేలా చూడాలి.
– శివ, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి