జీడిమెట్ల: గుడిలో దొంగతనానికి పాల్పడిన ఇద్దరు దొంగలను జీడిమెట్ల పోలీసులు 12 గంటల వ్యవధిలో పట్టుకుని రిమాండ్‌కు తరలించారు. మంగళవారం జీడిమెట్ల పీఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాలానగర్ డీసీపీ కె.సురేష్‌కుమార్, ఏసీపీ హన్మంత్‌రావు, జీడిమెట్ల ఇన్‌స్పెక్టర్ మల్లేష్, డీఐ కనకయ్యలతో కలిసి వివరాలను వెల్లడించారు. లంగర్‌హౌజ్, టోలీచౌకి ప్రాంతానికి చెందిన ఇద్దరు దొంగలు సోమవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో గాంధీనగర్‌లోని శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయంలోకి ప్రవేశించి..గర్భగుడి తలుపులు తెరిచి పంచలోహ విగ్రహాలు, ఇతర పూజా వస్తువులు ఎత్తుకెళ్లారు. ఉదయం గుడికి వెళ్లిన ఆలయ అధ్యక్షుడు కోనేటి వీరవెంకట సత్యనారాయణ దొంగతనం విషయాన్ని తెలుసుకుని సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించారు. ఇద్దరు వ్యక్తులు చోరీకి పాల్పడిన దృశ్యాలను గమనించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీసీపీ సురేష్‌కుమార్ ఆధ్వర్యంలో మూడు బృందాలుగా విడిపోయి...సీసీ కెమరాల పరిశీలనతో పాటు టెక్నికల్‌గా విచారణ జరిపి సాయంత్రం 7 గంటల వరకు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం ఉదయం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించి ఇద్దరిని రిమాండుకు తరలించారు. వారి నుండి రూ.95 వేలు విలువచేసే పంచలోహ విగ్రహాలు, వస్తువులు, రాగి సామాన్లు స్వాధీనం చేసుకున్నారు.
కాగా గుడిలో చోరీ విషయం తెలిసి స్థానికులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు వారికి నచ్చచెప్పి శాంతింపజేశారు. కాగా మంగళవారం ఉదయం గాంధీనగర్‌లో పోలీసులు పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు. హిందూవాహిని ఆధ్వర్యంలో ప్రజలు పెద్దఎత్తున గాంధీనగర్ చేరుకుని నిరసనలో పాల్గొన్నారు. పోలీసులు వెంట వెంటనే అందోళన చేపట్టిన వారిని జీడిమెట్ల స్టేషన్‌కు తరలించి కొంతమందిని ఇళ్లవద్దనే హౌజ్ అరెస్టు చేశారు. ఈ క్రమంలో ఆందోళనకారులు ఉరుకులు పరుగులు పెట్టడంతో పోలీసులు స్వల్పంగా లాఠీ చార్జీ చేశారు.