రికవరీ.. ఏమైందో మరి! | - | Sakshi
Sakshi News home page

రికవరీ.. ఏమైందో మరి!

Mar 11 2025 7:24 AM | Updated on Mar 11 2025 7:25 AM

ఫార్మాసిటీలో బినామీల పేరుతో ప్రజాధనం లూటీ
● ఇప్పటికే నకిలీలను తేల్చిన అధికారులు ● రికవరీతోపాటు చర్యలు తేసుకోవడంలో సర్కార్‌ తాత్సారం ● అక్రమార్కులను కాపాడుతున్నదెవరు?

యాచారం: ఫార్మాసిటీలో బినామీల పేరుతో ప్రజాధనాన్ని లూటీ చేసిన ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లూటీ చేసిన రూ.కోట్లాది ప్రజాధనాన్ని రికవరీ చేసే విషయంలో ఫైలును ముందుకు కదలనీయకుండా సర్కార్‌లోని పెద్దలు కొందరు అడ్డుపడుతున్నట్లు తెలుస్తోంది. గత బీఆర్‌ఎస్‌ హయాంలో ఫార్మాసిటీకి 19,333 ఎకరాలను సేకరించడానికి నిర్ణయించడం తెలిసిందే. అందులో భాగంగా యాచారం మండలంలోని నక్కర్తమేడిపల్లి, నానక్‌నగర్‌, తాడిపర్తి, కుర్మిద్ద గ్రామాల్లో పది వేల ఎకరాలకు పైగా అసైన్డ్‌, పట్టా భూములను సేకరించడానికి నిర్ణయించగా 7,640 ఎకరాలు సేకరించి రైతులకు పరిహారం అందజేశారు. మొదట్లో జరిగిన భూసేకరణలో అసైన్డ్‌ పట్టా భూముల్లో సాగు (పట్టాదారు, పాసుపుస్తకాల్లో 5 ఎకరాలుంటే గుట్టలు, రాళ్లు, రప్పలు తీసేసి) యోగ్యమైన భూములకే పరిహారం ఇచ్చారు. తర్వాత అధికారులతో కుమ్మకై ్కన కొందరు నకిలీలు, బినామీల పేర్లతో గుట్టలు, రాళ్లు, రప్పలున్న భూములపై పరిహారం పొందారు.

గ్రామాలకు సంబంధం లేనివారు సైతం..

ఫార్మాసిటీ వ్యతిరేక పోరాటం చేస్తున్న వారిలో అత్యధికులు బినామీల పేర్లతో పరిహారం పొందినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుత సర్కార్‌లోని ఓ కీలక నేత ఫిర్యాదుతో ఇంటెలిజెన్స్‌ ద్వారా నకిలీలు, బినామీల జాబితాను ప్రభుత్వం తెప్పించుకుంది. 2020 నుంచి 2023 వరకు నకిలీలు, బినామీలకు ఫార్మా పరిహారం పేరుతో రూ.కోట్లాది నిధులు మంజూరైనట్లు అధికారులు గుర్తించారు. 250 మందికిపైగా రూ.500 కోట్ల వరకు పరిహారం పొందారని తేల్చారు. పరిహారం పొందిన వారిలో స్థానికులే కాకుండా నల్లగొండ, హైదరాబాద్‌ జిల్లాలతో పాటు ఈ గ్రామాలకు సంబంధం లేని వ్యక్తుల పేర్లు సైతం ఉన్నట్లు తేలింది. నకిలీలు, బినామీల పేర్లతో పరిహారం పొందిన వారే ఇప్పుడు మళ్లీ ఫార్మాసిటీ వ్యతిరేక ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్నట్లు జోరుగా చర్చలు సాగుతున్నాయి. కొద్ది రోజుల క్రితం నకిలీలు, బినామీల లిస్టు ఫైనల్‌ చేసిన అధికారులు నోటీసులు ఇచ్చి, రికవరీ చేసేలా ఫైలు కదిపినా ఏమైందో కానీ దాన్ని కప్పిపెట్టినట్లు ఆరోపణలు వస్తున్నాయి. నోటీసులిస్తే తమ బండారం బయటపడుతుందనే భయంతో ఉన్నతాధికారులు జిల్లా అధికారులను వారిస్తున్నట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి.

ఫార్మా ప్లాట్ల లాటరీ అందుకే ఆలస్యం..

ఫార్మాసిటీ నకిలీలు, బినామీలు రూ.కోట్లాది పరిహారంతో పాటు మీరాఖాన్‌పేటలోని టీజీఐఐసీ మెగా వెంచర్‌లో ప్లాట్ల సర్టిఫికెట్లు సైతం పొందారు. దాదాపు 500 ఎకరాలకుపైగా పరిహారం పొందిన బినామీలు 121 గజాలు, 242 గజాల చొప్పున ప్లాట్ల సర్టిఫికెట్లు దక్కించుకున్నారు. ముందు జాగ్రత్తగా ప్లాట్లను అమ్మేసుకుంటున్నారు. 121 గజాల ప్లాటును రూ.8 లక్షలు, 242 గజాల ప్లాటును రూ.15 లక్షల చొప్పున విక్రయిస్తున్నారు. నెల క్రితమే లాటరీ ద్వారా ఫార్మా ప్లాట్లను రైతులకు రిజిస్ట్రేషన్లు చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. లాటరీ ద్వారా ఎంపిక చేసి కబ్జాలిస్తే భవిష్యత్తులో చిక్కులొస్తాయనే భయం వారిలో నెలకొంది. నకిలీల ఏరివేత, డబ్బుల రికవరీ తర్వాతే ఎంపిక ప్రక్రియ, రిజిస్ట్రేషన్లు చేసి కబ్జాలు ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మరింత జాప్యం జరిగే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement