చేవెళ్ల: నలుగురూ ఆడపిల్లలే.. అయినా ఎందులోనూ తీసిపోకూడదనే ఉద్దేశంతో మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ ఇస్తున్నాడు ఆ తండ్రి. మండలంలోని గొల్లపల్లి గ్రామానికి చెందిన కావలి కృష్ణ, దివ్య దంప తులు. వారికి నలుగురు ఆడపిల్లలు. కృష్ణ చిన్నతనంలో నేర్చు కున్న కరాటే తన కుటుంబానికి జీవనాధారంగా మారింది. కరాటేలో 5వ డాన్ బ్లాక్‌బెల్టు సాధించిన అతడు శిక్షణ తరగతులు నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. నలుగురు ఆడపిల్లలు అన్న బాధ లేకుండా వారిలో ఆత్మవిశ్వాసం నింపితే సమాజంలో అందరితో సమానంగా రాణిస్తారని నమ్మాడు. దీంతో కూతుళ్లకు కరాటేలో శిక్షణ ఇస్తున్నాడు. పెద్ద కూతురు జేమిమ్మ ఎనిమిదేళ్ల వయస్సులోనే కరాటేలో వైట్, ఎల్లో, ఆరెంజ్ బెల్టులు సాధించింది. రెండో కూతురు రూతు ఆరేళ్ల వయసులో వైట్, ఎల్లో బెల్టులు సాధించింది. మూడో కూతురు జేరుషా సైతం నాలుగేళ్లకే అక్కలతోపాటు కరాటేలో శిక్షణ తీసుకుంటోంది. ‘నాకున్న అస్తి, ధైర్యం నా నలుగురు అమ్మాయిలే. ఎక్కడా వారు తక్కువ కాకుండా ఉండాలనే కరాటేలో శిక్షణ ఇస్తున్నాను. వారికి ఇష్టమైన ఏ రంగంలో అయినా రాణించేందుకు పూర్తి సహకారం అందిస్తాను’ అంటున్నాడు.