చిలకలగూడ: మద్యం మత్తులో స్నేహితుల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు మృతి చెందిన ఘటన చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ అనుదీప్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సికింద్రాబాద్ మహ్మద్‌గూడ, శ్రీనివాసనగర్ ప్రాంతాలకు చెందిన పాస్టం నగేష్ (25), నర్సింగ్, శబరి, సాయికిరణ్ స్నేహితులు. నగేష్ శుభకార్యాల్లో బ్యాండ్ వాయించేవాడు. ఈనెల 5న కుటుంబ సభ్యులతో కలిసి మహ్మద్‌గూడలోని ఓ ఫంక్షన్‌కు వెళ్లిన అతను రాత్రి 9 గంటల ప్రాంతంలో వచ్చాడు. అదే సమయంలో స్నేహితుల నుంచి ఫోన్ రావడంతో పది నిమిషాల్లో వస్తానని చెప్పి బయటికి వెళ్లిన అతను తన స్నేహితులు నగేష్, నర్సింగ్, శబరి, సాయికిరణ్‌తో కలిసి పార్శిగుట్టలోని ఓ వైన్‌షాపు వద్ద మద్యం తాగారు. వైన్‌షాపు మూసివేసే సమయంలో మరికొంత మద్యాన్ని కొనుగోలు చేసి మహ్మద్‌గూడలోని ముత్యాలమ్మ ఆలయం వద్దకు వచ్చిన వారు మద్యంతో పాటు గంజాయి సేవించారు. ఈ క్రమంలో పచ్చబొట్టు విషయమై నగేష్, శబరి మధ్య గొడవ జరగడంతో నర్సింగ్ కలుగజేసుకున్నాడు. దీంతో వారు ఒకరినొకరు దూషించుకుంటు గల్లాలు పట్టుకుని ఘర్షణ పడ్డారు. ఈ క్రమంలో నర్సింగ్ చేతికి అందిన కర్రతో నగేష్‌పై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో శబరి, సాయికిరణ్ అపస్మారకస్థితిలో పడి ఉన్న నగేష్‌ను సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అతను అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. నిందితుడు నర్సింగ్, మృతుడు నగేష్ బంధువులు కావడం గమనార్హం. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. మృతుడి తండ్రి యాదగిరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు నర్సింగ్‌తోపాటు మిత్రులు శబరి, సాయికిరణ్‌లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు.
ఒకరి మృతి
పది నిమిషాల్లో వస్తానని చెప్పి..తిరిగిరాని లోకాలకు..