● మూడుసార్లు సంబరాలు.. బంధాల పరిమళాలు ● ఆడపడుచుల అదృష్టం ● ఈనెల 16న సద్దుల బతుకమ్మ
వేములవాడ: తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగలో వేములవాడ నియోజకవర్గ ఆ డపడుచులకు దక్కే అవకాశం మరెక్కడా ఉండదు. పుట్టినిల్లు, మెట్టినిల్లు, బంధువుల ఇళ్లు.. ఇలా ప్రాంతాలను బట్టి మూడుసార్లు బతుకమ్మ వేడుకల్లో పా ల్గొనే అరుదైన అవకాశం ఇక్కడి మహిళల సొంతం.
మురిపించే ముచ్చట్లు.. మురిపెంతో బతుకమ్మ బంధాలు
వేములవాడ రాజన్న క్షేత్రంలో సప్తమాతృకా ఆరాధన ప్రత్యేకత కారణంగా ఇక్కడ ఏడు రోజులకే సద్దుల బతుకమ్మ వేడుకలు జరుగుతాయి. సప్తమాతృకల పూజల అనంతరం ఇక్కడ బతుకమ్మ నిమజ్జనం నిర్వహిస్తారు. ఇక పట్టణంలోనూ, చుట్టుపక్కల పల్లెల్లో దసరాకు ముందు తొమ్మిది రోజులు ఈ వేడుకలు జరుపుకుంటే, రుద్రంగి, కథలాపూర్, మేడిపల్లి, భీమారం మండలాల్లో దసరా ఉత్సవాల అనంతరం సద్దుల బతుకమ్మ జరుపుకోవడం అనాదిగా వస్తున్న ఆచారం. ఈ మూడు వేర్వేరు సమయాల వల్ల ఇక్కడి ఆడపడుచులకు ఊహించని అదృష్టం కలుగుతుంది. వేములవాడలో ఏడు రోజులకు జరిగే వేడుకల్లో పాల్గొంటూనే, పుట్టినింటికి వెళ్లి తొమ్మిది రోజుల బతుకమ్మ సంబరాల్లో, అలాగే మెట్టినిల్లు లేదా బంధువుల ఊళ్లలో దసరా తర్వాత జరిగే వేడుకల్లో పాల్గొంటారు. కాగా, ఈనెల 16న వేములవాడలో సద్దుల బతుకమ్మ పండుగ జరుపుకోనున్నారు.


